
ఏపీకి ప్రత్యేక హోదా సీరియస్ అంశం
న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్ నేతలతో బీజేపీ నాయకుల సమావేశాన్ని తప్పుపట్టడం అర్థరహితమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆర్ఎస్ఎస్ జాతీయవాద దేశభక్తి సంస్థ అని ఆయన గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వ పనితీరుపై ఆ సంస్థ సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. శనివారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.... ఆర్ఎస్ఎస్ నేతలతో తమ ఆలోచనలు పంచుకున్నామని చెప్పారు. అయితే ఈ సమావేశంలో ఎటువంటి తీర్మానాలు మాత్రం జరగలేదని వెంకయ్య స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సీరియస్ అంశమని తెలిపారు. ఆ అంశాన్ని ప్రధాని మోదీ నీతి ఆయోగ్కు అప్పగించారని పేర్కొన్నారు. విభజన సమయంలో ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసింది.... ఆ తర్వాత సరిదిద్దే ప్రయత్నాలు చూడా చేయలేదని వెంకయ్యనాయుడు ఆ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రధానిని పక్కనపెట్టి 10 జన్పథ్ ఆదేశాలు ఇచ్చేది ఎద్దేవా చేశారు. విజయవాడ దుర్గమ్మ వారధికి తమ ప్రభుత్వం రూ. 330 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. త్వరిత గతిన ఈ నిర్మాణం పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను కోరామన్నారు.
విజయవాడ మెట్రో రైలుపై కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కమ్యూనిస్టులు రష్యా, చైనా దేశాలకు వెళ్లి మార్గదర్శకాలు తీసుకుంటున్నారు. అలాంటి సమయంలో తమ పార్టీపై... తమ నేతలపై కమ్యూనిస్టులు మాట్లాడే అర్హత లేదని వెంకయ్య చెప్పారు.