'అంతా మీరే చేశారు'
'అంతా మీరే చేశారు'
Published Tue, Sep 3 2013 2:15 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
ముంబై: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కష్టాలకు ఉద్యోగులు, బ్యాంకులు తదితరులందరూ కారణమని ఆ సంస్థ చైర్మన్ విజయ్ మాల్యా ఆరోపించారు. ఇంజిన్ సప్లయర్స్ నుంచి ఉద్యోగులు, బ్యాంకులు, పన్ను అధికారులు... ప్రతీ ఒక్కరూ కింగ్ ఫిషర్ సంస్థ కష్టాల పాలవ్వడానికి కారకులయ్యారని ఆయన విమర్శించారు. కంపెనీ వార్షిక నివేదిక(2012-13)లో మాల్యా ఈ వివరాలు పేర్కొన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల పునరుద్ధరణ కోసం తగిన భాగస్వామిని ఎంచుకునే ప్రక్రియ కొనసాగుతోందని, ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని కూడా ఈ నివేదికలో ఆయన వెల్లడించారు. ఈ నెల 24న జరగునున్న ఏజీఎం కోసం ఇన్వెస్టర్లకు ఈ వార్షిక నివేదికను పంపించారు.
సమ్మెలతో షెడ్యూల్ అస్తవ్యస్తం
ఇంటర్నేషనల్ ఏరో ఇంజిన్స్ ఏజీకి వ్యతిరేకంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ హోల్డింగ్ కంపెనీ యునెటైడ్ బ్రూవరీస్(హోల్డింగ్స్) బెంగళూరు కోర్టులో కేసు వేసిందని ఈ నివేదిక తెలిపింది. లోపాలున్న ఇంజిన్లను తమకు అంటగట్టారని, రూ.1,477 కోట్ల నష్టపరిహారం కావాలంటూ ఈ కేసు దాఖలు చేశామని వివరించింది. ఇంధనం ధరలు అధికంగా ఉండడం, తదితర క్లిష్ట పరిస్థితులకు తోడు ఇంజిన్ సమస్యలు కూడా జతవడంతో కంపెనీ కార్యకలాపాలు, ఆర్థిక వనరులు కుదేలయ్యాయని వివరించింది. పులి మీద పుట్రలా పన్ను అధికారులు కర్కశంగా వ్యవహరించారని, ఆదాయ మార్గాలను, అకౌంట్లను అటాచ్ చేశారని ఈ నివేదిక పేర్కొంది.
Advertisement