అర్ధరాత్రి.. గుట్టుగా ఆందోళనస్థలికి సూపర్ స్టార్!
జల్లికట్టు ఆందోళనకు విజయ్ మద్దతు
తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మద్దతుగా వేలాదిమంది యువత జరిపన ఆందోళనకు మద్దతుగా తమిళ సినీ నటుల సంఘం నడిగర్ మౌన నిరసన ప్రదర్శన తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నిరసన ప్రదర్శనలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తోపాటు పలువురు తమిళ అగ్రనటులు పాల్గొన్నారు. అయితే, ఇందులో తమిళ అగ్రహీరో, ఇలయదళపతి విజయ్ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అదే రోజు రాత్రి విజయ్ మేరినా బీచ్ వద్ద ఆందోళన చేస్తున్న లక్షలమంది యువతకు ఆయన మద్దతు పలికారు. వారితో కలిసి నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు. జల్లికట్టుకు అనుకూలంగా నినాదాలు చేశారు. జల్లికట్టు ఆందోళనకు ముఖ్యకేంద్రంగా ఉన్న చెన్నైలోని మెరీనా బీచ్‌కు రహస్యంగా వచ్చిన విజయ్ ముఖానికి కర్చీఫ్ కట్టుకొని నిరసనలో పాల్గొన్నారు.
తాను పాల్గొనడం వల్ల అందరి దృష్టి తనపై పడి.. ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఆయన ఇలా గుట్టుగా పాల్గొన్నారని సన్నిహత వర్గాలు తెలిపాయి. నడిగర్ సంఘం జరిపిన మౌనప్రదర్శనను యువత తప్పుబట్టారు. తాము జోరుగా చేస్తున్న ఆందోళన నుంచి మీడియా దృష్టిని ఇది మరలుస్తుందని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో నేరుగా యువత మనోగతానికి అనుగుణంగా వారితో కలిసి విజయ్ ఆందోళనలో పాల్గొన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అర్థరాత్రి మేరినా బీచ్‌లో కనిపించిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.