హోదాతోనే అన్నీ రావు
విజయవాడ విలేకరుల సమావేశంలో చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అన్నీ వచ్చేస్తాయని కొందరు మభ్యపెడుతున్నారని, కానీ ప్రత్యేకహోదాతోనే అన్నీ రావని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తుంది, అది ఉన్న రాష్ట్రాలకు ఇప్పటివరకూ ఎన్ని నిధులు వచ్చాయనే విషయాలను అందరూ తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఆయన బుధవారం రాత్రి తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ప్రత్యేకహోదా అంశంపై నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తాను స్పందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని, రాయితీలు ఇచ్చి పరిశ్రమలను ప్రోత్సహిస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని తాను ఎనిమిదిసార్లు ప్రధానిని, అనేకసార్లు కేంద్రమంత్రులను కలిసి కోరానని తెలిపారు. విభజనకు ముందునుంచి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలపై వివరణ పత్రాలు విడుదల చేస్తామని చెప్పారు. తాజా పరిణామాలపై తాను మంగళవారం కేంద్ర మంత్రులతో మాట్లాడానని, బుధవారం ప్రధాన మోడీ తనకు ఫోన్ చేశారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించానని, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరానని చెప్పారు. 15వతేదీ తర్వాత అన్ని విషయాలు చర్చిద్దామని ప్రధాని చెప్పారన్నారు.
ప్రత్యేకహోదా రాదని మనమే ఒక నిర్ణయానికి రావడం సరికాదని, దీనిపై ప్రధామంత్రి స్పష్టత ఇవ్వాల్సి ఉందని తెలిపారు. రాజధాని భూసమీకరణపై ఎన్నో కుట్రలు జరిగాయని, సోనియా జోక్యం చేసుకున్నా, మేథాపాట్కర్‌ను తీసుకొచ్చినా రైతులు భూమి ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తమపై పెత్తనం చేయాలని చూస్తోందని, సెక్షన్-8 గురించి ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. సాధ్యమైనంతవరకూ ఇకపై పరిపాలన విజయవాడనుంచే నిర్వహిస్తామని, ఒకటి, రెండు నెలల్లో శాఖలు వస్తాయని చెప్పారు. స్థానికతపై ఉద్యోగులు ఎలా కోరుకుంటే అలా చేస్తామని తెలిపారు.
ఈనెల 15న పట్టిసీమను జాతికి అంకితం చేయడం మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. పనుల వేగంవల్ల నాణ్యత తగ్గే అవకాశాలున్నాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మెతక వైఖరి అవలంబిస్తున్నారని మీడియాప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన చిర్రెత్తిపోయారు. మీరుచేసేది మీరు చేయండి... నేనుచేసేది నేను చేస్తానంటూ సమాధానాన్ని దాటవేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ ఉన్నారు.
రాజధాని నిర్మాణంపై సీఎం సమీక్ష
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విజయవాడలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సమీకరించిన భూమి, మిగిలిన భూమిని ఎలా సమీకరించాలనే దానిపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు.
90 శాతం భూమిని సమీకరించగా, మిగిలిన పది శాతం భూమిని కూడా త్వరగా సమీకరించాలని, అవసరమైతే భూసేకరణకు వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ల విషయంలో నిపుణుల నుంచి వచ్చిన అభిప్రాయాలపై సమావేశంలో చర్చ జరిగింది. అంతకుముందు రాష్ట్రంలోని పరిశ్రమలకు నీరు ఎలా ఇవ్వాలనే అంశంపై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.