హోదా కోసం.. నేడు విశాఖలో ‘యువభేరి’
♦ ప్రత్యేక సదస్సును నిర్వహిస్తున్న ఆంధ్రా వర్సిటీ విద్యార్థులు
♦ వేదిక విశాఖపట్నం పోర్టు కళావాణి ఆడిటోరియం..
♦ ‘నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విద్య, ఉపాధి అవకాశాలు-రాష్ట్రాభివృద్ధి’పై చర్చ
♦ ముఖ్య అతిథిగా హాజరవుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
♦ ప్రత్యేక హోదా సాధన ఆవశ్యకతపై మార్గనిర్దేశం చేయనున్న విపక్ష నేత
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యువత సమరభేరి మోగిస్తోంది.
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తాయని, తద్వారా తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశించిన విద్యార్థి, నిరుద్యోగ యువత రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా ఆ ఊసే లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. ఇది ఆగ్రహంగా మారి విద్యార్థి, నిరుద్యోగ యువత ఉద్యమ దిశగా కదులుతోంది. ఈ క్రమంలో ఈ నెల 15న తిరుపతిలో విద్యార్థులు ‘యువభేరి’ పేరిట సమరభేరి మోగించారు.
ఇదే క్రమంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థులు సాగుతున్నారు. ‘నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విద్య, ఉపాధి అవకాశాలు-రాష్ట్ర భవిష్యత్తు’ అనే అంశంపై విశాఖపట్నంలో మంగళవారం ‘యువభేరి’ పేరిట భారీ సదస్సును నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో మంగళవారం ఉదయం 10 గంటల కు నిర్వహించే ఈ యువభేరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ర్టంలో అభివృద్ధి జరుగుతుందని, యువతకు ఉద్యోగాలొస్తాయని తొలినుంచీ పోరాడుతున్న జగన్ ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధనపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్నారు.
పోరు ఆవశ్యకతను వివరించనున్న జగన్
అడ్డగోలు విభజన వల్ల రాష్ట్రానికి కలిగిన నష్టం, విద్యార్థులు-యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన తీరును జగన్ ఈ సదస్సులో వివరించనున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రభుత్వం మోసగిస్తున్న తీరును తేటతెల్లం చేస్తారు. రాష్ట్రం ప్రగతిపథంలో సాగి ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ప్రత్యేక హోదా సాధించాల్సిన ఆవశ్యకతపై విద్యార్థులు, యువతకు ఆయన దిశానిర్దేశం చేస్తారు.
అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను ఆయన ప్రస్తావిస్తారు. ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల సమస్యలు, హాస్టళ్ల కుదింపు, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, విద్యార్థులపై లాఠీచార్జి తదితర అంశాలను లేవనెత్తనున్నారు. అలాగే యువత సందేహాలను నివృత్తి చేస్తారు. హోదా సాధన దిశగా విద్యార్థులు, యువతతోపాటు అన్నివర్గాల ప్రజలు పోరుబాట పట్టాల్సిన అవసరాన్నీ వివరిస్తారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు విభజనవల్ల కలిగిన నష్టం, ప్రత్యేక హోదా సాధన ఆవశ్యకతపై కళావాణి ఆడిటోరియం ప్రాంగణంలో ప్రత్యేకంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఇతర నేతలు సదస్సు నిర్వహించనున్న పోర్టు కళావాణి ఆడిటోరియంలో సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు.