సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ఈ మధ్యనే ఒక ఐటీఐఆర్ ప్రాజెక్టు వచ్చిందని, మరో రెండు ఐటీఐఆర్‌ల కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. విశాఖలో ఒక ఐటీఐఆర్‌ను ప్రతిపాదించి, పూర్తిస్థాయి నివేదికను ఇప్పటికే కేంద్రానికి పంపించామన్నారు.
అలాగే, తిరుపతి, చిత్తూరు, అనంతపురం ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ వ్యాప్తికి మరో ఐటీఐఆర్‌ను ప్రతిపాదించామని, దీన్ని కూడా త్వరలో కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్న హైదరాబాద్‌లో ఒరాకిల్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించాలని లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. భారత పర్యటనలో ఉన్న ఒరాకిల్ సంస్థ ఆసియా-పసిఫిక్ జోన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆడ్రియన్ జోన్స్, ఒరాకిల్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సందీప్ మాధుర్‌తో ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి వాణిజ్య ప్రోత్సాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షా 25వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలను కల్పించిన ఒరాకిల్... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రణాళికలను రూపొందించుకుంటోందని మంత్రి అనంతరం మీడియాకు వివరించారు., ఈ దృష్ట్యానే ఆ సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమై హైదరాబాద్‌లోనూ విస్తరణను చేపట్టాలని కోరామని ఆయన తెలిపారు. రానున్న 30 ఏళ్లలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రూ.18 వేల కోట్ల వ్యయంతో 50 వేల ఎకరాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధిపర్చనున్నట్టు ఒరాకిల్ ఉన్నతాధికారులకు నివేదించానన్నారు. ఇదిలా ఉండగా, లేపాక్షి నాలెడ్జి పార్క్ వ్యవహారం కోర్టులో ఉందని, సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఐటీ రంగ విస్తృతికి కృషిచేస్తామన్నారు.
రాష్ట్రానికి మరో రెండు ఐటీఐఆర్‌లు
Published Sat, Oct 19 2013 1:17 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement