శాంతియుత పరిష్కారం కావాలి
ఇజ్రాయెల్ - పాలస్తీనా విభేదాలపై ప్రణబ్, అబ్బాస్ పిలుపు
రమల్లా: ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య విభేదాలను అంతర్జాతీయంగా అంగీకరించిన సూత్రాల ప్రాతిపదికగా చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనాలని భారత్, పాలస్తీనాలు పిలుపునిచ్చాయి. విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం పాలస్తీనా చేరుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమై చర్చించారు. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కొనసాగుతున్న హింసపై మాట్లాడారు. తూర్పు జెరూసలేం రాజధానిగా సార్వభౌమ, స్వతంత్ర పాలస్తీనాకు భారత్ పూర్తి మద్దతు ఇస్తోందని తెలియజేశారు. ఇజ్రాయెల్ సరసన పాలస్తీనా శాంతియుతంగా మనుగడ సాగించాలని భారత్ కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఉగ్రవాదం.. ప్రత్యేకించి ఐఎస్‌ఐఎస్, అల్‌ఖైదాల అంశమూ ఈ అగ్రనేతల మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా పాలస్తీనా అథారిటీకి భారత్ రూ. 32.3 కోట్ల చెక్కును బడ్జెటరీ మద్దతుగా అందించింది. అలాగే.. పాలస్తీనా భూభాగంలో రమల్లాలో టెక్నాలజీ పార్కు సహా ఐదు ప్రాజెక్టుల కోసం రూ. 115 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చింది. అంతకుముందు జోర్డాన్ పర్యటన ముగించుకుని రమల్లా చేరుకున్న ప్రణబ్.. పాలస్తీనా నేత అరాఫత్ సమాధి వద్ద నివాళులర్పించారు.