మృతుల్లో వరంగల్ జిల్లావాసి
Published Sun, Sep 15 2013 3:00 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
బచ్చన్నపేట, న్యూస్‌లైన్: మల్కనగిరి అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జిలానీబేగం అలియాస్ ప్రమీల (40) రెండు దశాబ్దాలుగా మావోయిస్టు విప్లవోద్యమంలో పనిచేస్తోంది. ప్రస్తుతం ఏవోబీ స్పెషల్ జోనల్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా, పాడియా డివిజన్ కార్యదర్శిగా ఉన్న ఆమెపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన నిలిగొండ ప్రమీల 1994లో నర్మెట రాధక్క దళ సభ్యురాలిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. అనంతరం నర్సంపేట, ఏటూరునాగారం దళాల సభ్యురాలిగా పనిచేసింది.
అప్పుడే గాజర్ల రవి అలియాస్ గణేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. 2002లో ఏటూరునాగారం డిప్యూటీ దళ కమాండర్‌గా, అక్కడే ఎల్‌జీఎస్ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టింది. 2005 ఫిబ్రవరి 7న కరీంనగర్ జిల్లా కాటారంలో ప్రమీలను పోలీసులు అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారు. 2006 మార్చి15న బెయిల్‌పై విడుదలై, పోచ్చన్నపేటలో నెల రోజులున్న ప్రమీల తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. మూడుసార్లు అరెస్ట్ అయిన ఆమెపై కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 33 కేసులు నమోదయ్యాయి.
Advertisement