
సవరణలు తెస్తాం.. మెడలు వంచుతాం
టీ బిల్లుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ సమన్యాయం చేయకపోతే మేం అధికారంలోకి వచ్చాక చేస్తాం
ప్రజల ఆలోచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం
రాజధాని, దాని నిర్మాణంపై కేంద్రంతో మాట్లాడతాం
తెలంగాణ బిల్లును శీతాకాల సమావేశాల్లో పెట్టాలన్నదే మా అభిప్రాయం
సాక్షి, న్యూఢిల్లీ: తె లంగాణ, సీమాంధ్రకు న్యాయం జరిగేలా రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో సవరణలకు ప్రభుత్వం మెడలు వంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయకపోతే, బీజేపీ అధికారంలోకి వచ్చాక చేస్తామన్నారు. రాష్ట్ర విభజన అయ్యే వరకు పొత్తులపై చర్చ లేదని తేల్చి చెప్పారు. శనివారమిక్కడ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అనంతరం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘పార్లమెంటులో బీజేపీ వైఖరి మారదు. తెలంగాణ, సీమాంధ్రకు న్యాయం జరిగేలా కచ్చితంగా బిల్లులో కొన్ని సవరణలు తీసుకు వస్తాం. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పాం.
బీజేపీ అధికారంలో ఉన్నప్పడు మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఆరు రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా మిఠాయిలు పంచుకున్నారు. కానీ ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో రెండు ప్రాంతాలు సంతోషంగా ఉండేలా, సమస్యలు పరిష్కారమయ్యేలా తెలంగాణ చిరకాల వాంఛ నెరవేరే విధంగా కృషి చేస్తాం’’ అని చెప్పారు. కాంగ్రెస్ రెండు ప్రాంతాలకు సమన్యాయం చేస్తుందని నమ్ముతున్నారా అని ప్రశ్నించగా.. ‘సమన్యాయం చేయిస్తాం’ అని బదులిచ్చారు. సమన్యాయం చేయకపోతే అని అడగ్గా.. ‘అధికారంలోకి వచ్చాక చేస్తాం’ అని చెప్పారు. బిల్లును యథాతథంగా పార్లమెంటులో పెడితే సమర్థిస్తారా అని అడగ్గా.. ‘‘అన్నీ చెబితే ఎట్లా..’’ అని ఎదురు ప్రశ్నించారు. ‘‘మా ఆలోచనలు, ప్రజల ఆలోచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. రాష్ట్ర రాజధాని, దాని నిర్మాణం, సమస్యలు, అనేక అంశాలు ఉన్నాయి. వాటిపై కేంద్రంతో మాట్లాడతాం. సుష్మా సహా మా పార్టీ పెద్ద నేతలతో మాట్లాడాం. తెలంగాణ బిల్లును శీతాకాల సమావేశాల్లో పెట్టాలన్నదే మా అభిప్రాయం’’ అని చెప్పారు. బిల్లు ఆమోదం పొందకుంటే అందుకు బీజేపీదే బాధ్యత అని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘దాంతో.. బీజేపీకి ఏం సంబంధం..? విభజనపై మేం చాలా స్పష్టంగా ఉన్నాం’’ అని చెప్పారు.
రాజ్‌నాథ్‌ను కలిసిన రఘురామ కృష్ణంరాజు..
వైఎస్సార్‌సీపీ బహిష్కృత నేత రఘురామ కృష్ణంరాజు, పారిశ్రామికవేత్త బస్వరాజ్ పాటిల్‌లు శనివారం కిషన్‌రెడ్డితో వెళ్లి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. బీజేపీలో చేరేందుకు రాజ్‌నాథ్ ఆశీర్వాదాన్ని తీసుకున్నట్లు రఘురామ కృష్ణంరాజు చెప్పారు. హైదరాబాద్ వెళ్లాక కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకుంటానని చెప్పారు. రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్ వేసిన మీరు ఇప్పుడు విభజనకు మద్దతు ఇచ్చే బీజేపీలో చేరడం వైరుధ్యం కాదా అని విలేకరులు అడగ్గా.. ‘‘ఇందులో వైరుధ్యం లేదు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలి, రెండువైపులా సంతోషంగా ఉండే విభజనను సమర్థిస్తామని కిషన్‌రెడ్డి ఇప్పటికే చెప్పారు. ఒకరి కళ్లలో నీళ్లు వచ్చే విభజనను బీజేపీ ఏనాడూ సమర్థించలేదు’’ అని ఆయన బదులిచ్చారు.