
తెలంగాణకు మేం మద్దతు ఇవ్వలేదు: శరద్
తెలంగాణకు తాము మద్దతు ఇవ్వలేదని జనతాదళ్ (యూ) అధినేత శరద్‌యాదవ్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ : అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన ఎలా సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను కలుసుకున్న వైఎస్ జగన్, ఈరోజు మధ్యాహ్నం జనతాదళ్ (యూ) అధినేత శరద్‌యాదవ్‌ను కలిశారు. రాష్ట్ర విభజన నిర్ణయం, తాజా పరిణామాలపై ఆయనకు వివరించారు. భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ విభజనను అడ్డుకోవాలని శరద్ యాదవ్ను కోరినట్లు తెలిపారు.
తెలంగాణకు మద్దతు ఇవ్వలేదు
అనంతరం శరద్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత గురించి జగన్ వివరించినట్లు తెలిపారు. తాము తెలంగాణకు మద్దతు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీని విశ్వాసంలోకి తీసుకోకుండా విభజన ఎలా చేస్తారని శరద్ యాదవ్ ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం లేకుండా విభజన ఎలా చేస్తారన్నారు. అసెంబ్లీ తీర్మానాలతోనే రాష్ట్ర విభజనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు మద్దతు ఇస్తామా లేదా అనేది పార్లమెంట్లో చెబుతామని శరద్ యాదవ్ అన్నారు.