భారత సైన్యంపై ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు
భారత సైన్యంపై ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు
Published Tue, Oct 4 2016 9:20 AM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM
ఉడీ ఘటన అనంతరం పాకిస్తాన్ నటులపై భారత్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐఎమ్పీపీఏ) విధించిన నిషేధ నేపథ్యంలో ప్రముఖ నటుడు ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉడీ ఘటనలో అమరవీరులైన భారత సైన్యంపై ఆయన అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం రాజుకున్నాయి. పాకిస్తానీ నటులపై ఐఎమ్పీపీఏ తీసుకున్న నిషేధంపై ఓ ప్రముఖ న్యూస్ చానల్ చర్చ నిర్వహించింది. ఆ చర్చలో ఉడీ ఉగ్రదాడిలో అసువులు బాసిన 18 వీర జవాన్లపై ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఓం పురి చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి.." ఎవరు వారిని(భారత సైన్యాన్ని) ఆర్మీలో చేరమన్నారు? ఎవరు వారిని ఆయుధాలు పట్టుకోమన్నారు. మేమేమి జవాన్లను ఆర్మీలో చేరమని చెప్పలేదుగా.15 నుంచి 20 మానవ బాంబులు తయారుచేయండి. పాకిస్తాన్ను పేల్చడానికి వాటిని వాడండి. ఇజ్రాయిల్, పాలస్తీనా మాదిరి భారత్-పాకిస్తాన్లు కూడా యుగయుగాలుగా శత్రువులుగా మారలనుకుంటున్నారా? కోట్లమంది ముస్లింలకు భారత్ పుట్టినిల్లు. భారత్-పాకిస్తాన్ విభజన అంటే కేవలం దేశాల విభజనే మాత్రమే కాదు, కుటుంబాలు విడిపోవడం కూడా. భారతీయుల కుటుంబసభ్యులు అక్కడ ఉన్నారు. అక్కడ వారు ఇక్కడా ఉన్నారు. సరిహద్దు కుటుంబాలు ఎలా యుద్ధం చేసుకుంటారు?. పాకిస్తాన్ నటులను, సెలబ్రిటీలపై నిజంగా నిషేధం విధించాలంటే, భారత ప్రభుత్వాన్ని వారి వీసాలు రద్దు చేయమనండి" అంటూ న్యూస్ చానల్ చర్చా కార్యక్రమంలో రెచ్చిపోయారు.
ముందు కూడా పాకిస్తాన్ నటులకు ఆయన మద్దతిచ్చారు. వాలిడ్ వీసాతో వారు ఇక్కడ పనిచేస్తున్నారని, వారిని నిషేధించడం సరికాదన్నారు. పాకిస్తానీ నటులపై నిషేధం, పరిస్థితుల్లో మార్పు తేవన్నారు. దీంతో ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.
Advertisement