పతంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించిన మోదీ
హరిద్వార్: పతంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప‍్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బాబా రాందేవ్ ఆధ‍్వర్యంలోని పతంజలి సంస్థ నిర్మించిన పరిశోధన కేంద్రం పతంజలి యోగ్‌పీఠ్ ను ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా గురు బాబా రాందేవ్‌కి ప్రధాని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. యోగా ప్రాచుర్యానికి, ఆయుర్వేద వైద్యానికి, ఔషధాలకు విశిష్టతను కల్పించారని భారత ఆయుర్వేద ఉత్పతులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌పుంజుకుందని ప్రధాని చెప్పారు. అయితే ఈ ఉత్పత్తులు వారికి చేరడం లేదని, పతంజలి పరిశోధన ద్వారా వచ్చే ఉత్పత్తులు వారికి చేరువ కావాలన్నారు. దేశానికి గర్వకారణమైన చారిత్రక, వారసత్వ సంపదను విస్మరించకూడదని ప్రధాని సూచించారు.
పతంజలి సీఈవో ఆచార‍్య బాలకృష్ణ బృందం రూపొందించిన ప్రపంచ హెర్బల్ ఎన్‌సైకిలో పీడియాను మోదీ విడుదల చేశారు. అలాగే రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అహ్మాదాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. తద్వారా దేశవ్యాప్తంగా యోగాను పాపులర్ చేయనున్నామని ప్రధాని ప్రకటించారు. ఈ ఉత్సవంలో సాధ‍్యమైనంతమంది పాల్గొనాలని పిలుపునిచ్చారు.