
ప్రజల కోసం ముండే పరితపించే వాడు: ప్రణబ్
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మంగళవారం మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండేకు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. వారం రోజుల క్రితం ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముండే ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలోతుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గోపీనాథ్ ముండే మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తో పాటు తదితర ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ ఘటనపై ప్రణబ్ మాట్లాడుతూ.. మనం ఒక గొప్ప సీనియర్ నాయకుడ్ని కోల్పోయాం. సామాన్య ప్రజానికానికి సేవ చేయాలనే తపన ముండేలో ఎక్కువగా ఉండేది. అతన్ని కోల్పోవటం చాలా బాధాకరం' అంటూ రాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 'మహరాష్ట్రలోని ప్రముఖ నేతల్లో ముండే ఒకరు. అతని మృతి నిజంగా పూడ్చలేనిది. ముండే ఎప్పుడూ ప్రజా జీవితంలోనే ఎక్కువగా ఉండేవాడు' అని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ నివాళులు అర్పించారు.