తక్కువ ధరకు ఉపకరణాలు ఆఫర్ చేస్తాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల విక్రయ రంగంలో ఉన్న బెంగ ళూరుకు చెందిన పాయ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ప్రవేశించింది. హైదరాబాద్‌లో రెండు శాంసంగ్ బ్రాండ్ స్టోర్లను ప్రారంభించిన ఈ సంస్థ డిసెంబరుకల్లా అయిదు మల్టీ బ్రాండ్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. దక్షిణాదిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉన్నందునే ఇక్కడ అడుగు పెట్టామని సంస్థ ఎండీ ఎస్.రాజ్‌కుమార్ పాయ్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 13 ఏళ్లుగా కర్ణాటక కస్టమర్లకు నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచామని చెప్పారు. వ్యవస్థీకృతరంగ ఔట్‌లెట్లతో పోలిస్తే తక్కువ ధరకు ఉపకరణాలను విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. పండగ ఆఫర్లు పారదర్శకంగా అందిస్తామని అన్నారు.
ధరలు మరింత పెరుగుతాయి..
రూపాయి పతనం కారణంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు మరో 8% దాకా పెరుగుతాయని రాజ్‌కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే ఉపకరణాన్నిబట్టి 20 శాతం దాకా హెచ్చాయని చెప్పారు. ఉత్పత్తుల అమ్మకాలు దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గినా, పరిశ్రమ వృద్ధి 10 శాతం ఉంటుందని వివరించారు. పాయ్ ఇంటర్నేషనల్‌కు కర్ణాటకలో 56 ఔట్‌లెట్లు ఉన్నాయి. సెల్‌ఫోన్ల విక్రయానికై పాయ్ మొబైల్ స్టోర్లు 18 ఉన్నాయి. వచ్చే ఏడాది మొబైల్ స్టోర్లను హైదరాబాద్‌లోనూ నెలకొల్పనున్నారు. 2012-13లో పాయ్ ఇంటర్నేషనల్ రూ.511 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లు అంచనా వేస్తోంది. రూ.40 వేల కోట్ల ఎలక్ట్రానిక్ ఉపకరణాల విపణిలో ఆంధ్రప్రదేశ్ వాటా 7.5 శాతముంది.