ఉప ఎన్నికల్లో మనమే గెలుస్తున్నం!
టీఆర్‌ఎస్ ఎల్పీ భేటీలో సీఎం కేసీఆర్
వరంగల్, నారాయణఖేడ్‌లలో సర్వేలన్నీ మనకే అనుకూలం
ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం కార్పొరేషన్ ఎన్నికలపై ఉంటుంది
పార్టీలో గ్రూపులను ప్రోత్సహించవద్దని హెచ్చరిక
హైదరాబాద్: ‘ఉప ఎన్నికలు జరగనున్న వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాల్లో మనమే గెలుస్తున్నం. ఈ రెండు చోట్లా సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయి. అయితే పార్టీ శ్రేణులన్నీ కష్టపడి పనిచేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ బాధ్యత తీసుకోవాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నట్లు సమాచారం. కేసీఆర్ నేతృత్వంలో గురువారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఉప ఎన్నికలు, కార్పొరేషన్ల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడంపైనే సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో వెయ్యి ఓట్ల తేడాతో 11 స్థానాల్లో ఓడిపోయాం. ఐదారు వందల ఓట్ల తేడాతో మరికొన్ని చోట్ల స్థానాలు కోల్పోయాం. గట్టిగా పనిచేసి ఉంటే ఇంకొన్ని స్థానాలు మన ఖాతాలో పడేవి. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా పనిచేద్దాం..’’ అని నేతలకు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.
వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్థానాలకు బిహార్ ఎన్నికలతోనే నోటిఫికేషన్ వస్తుందని భావించినా రాలేదు. అయితే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు ఈ నెలాఖరున నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తర్వాత జరిగే జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్ధిపేట మున్సిపాలిటీకి జరిగే ఎన్నికలపై ఉంటుందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉప ఎన్నికల్లో ఆయా జిల్లాల నేతలంతా కలసి పనిచేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
తక్కువ సభ్యులతో పొలిట్‌బ్యూరో?
పార్టీలో అత్యున్నతమైనదిగా భావించే పోలిట్‌బ్యూరోను తక్కువ మంది సభ్యులతో ఏర్పాటు చే స్తామని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. ఐదారు మందికే పొలిట్‌బ్యూరో పరిమితం కానుందని... రాష్ట్ర కమిటీని 42 మందితో ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు సమాచారం. ‘పార్టీలో గ్రూపులను ఎట్టి పరిస్థితుల్లో ప్రొత్సహించొద్దు. మీరు మళ్లీ గెలవాలంటే అందరినీ కలుపుకొని పోవాలి. మార్కెట్ కమిటీల నియామకాల్లో గందరగోళానికి గురికావొద్దు. ఉద్యమ పార్టీగా మనతో కలిసి నడిచిన వారున్నారు. రాజకీయ పార్టీగా మారాక మనతో కలసి వచ్చిన వారున్నారు. పాత, కొత్త కలయికతో పదవులు భర్తీ చేసుకోవాలి..’’ అని సూచించారని తెలిసింది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లను హైదరాబాద్‌లో నిర్ణయిస్తామని... డెరైక్టర్ పోస్టులకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాలని సూచించారని సమాచారం. కాగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల మోడల్‌ను ఐడీహెచ్ కాలనీకి వెళ్లి చూడాలని సీఎం సీఎం సూచించడంతో.. భేటీ అనంతరం నేతలంతా ఆ కాలనీకి వెళ్లారు.