అత్యాచారానికి గురై.. బాలిక ఆత్మార్పణ
సామూహిక అత్యాచారం చేయడమే కాక.. ఆ తర్వాత కూడా విపరీతంగా బెదిరించడంతో పశ్చిమబెంగాల్లో ఓ బాలిక (16) బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. డిసెంబర్ 23వ తేదీన ఆమె కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ, తీవ్ర గాయాలతో ఆమె మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఇటు ఆస్పత్రి సిబ్బంది గానీ తమ కుమార్తెను ఏమాత్రం పట్టించుకోలేదని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. సామూహిక అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆస్పత్రి సిబ్బంది అసలు తమ కుమార్తెకు సరిగా చికిత్సే అందించలేదని, ప్రభుత్వం తరఫు నుంచి కనీసం ఒక్కరు కూడా వచ్చి పలకరించిన పాపాన పోలేదని ఆయన వాపోయారు. తన కుమార్తె చనిపోయినా.. తాను మాత్రం ఆ దుండగులను ఉరి తీసేవరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ అమ్మాయి చనిపోలేదని, ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వమే ఆమెను చంపేశారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్యాంలాల్ చక్రవర్తి ఆరోపించారు. తరచు ఆమెను వాళ్లు వేధింపులకు గురిచేస్తున్నా.. ప్రభుత్వం ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. బీహార్కు చెందిన ఈ కుటుంబం పొట్టకూటి కోసం పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు వలస వచ్చింది.