
ఆ రెండు రోజులు ఏం జరిగింది?
‘ఓటుకు కోట్లు’ కేసులో పెరుగుతున్న పాత్రధారులు
మే 30, 31వ తేదీలపై దృష్టి పెట్టిన ఏసీబీ
టీడీపీ నేతల తుదిరోజు విచారణ ముగింపు
హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన మే 31వ తేదీతో పాటు అంతకుముందు రోజున చోటు చేసుకున్న కీలక పరిణామాలన్నింటిపైనా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఈ కేసును విచారించే కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి రావడంతో పాటు పాత్రధారులు, అనుమానితులు, సాక్షుల సంఖ్య పెరుగుతూనే ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఓటుకు కోట్లు’ కుట్ర వెనుక మరిన్ని ‘పెద్ద అంశాలు’ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో సాక్షులుగా నోటీసులు అందుకున్న నలుగురు టీడీపీ నేతలు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డ్రైవర్‌ల రెండు రోజుల విచారణ మంగళవారంతో ముగిసింది.
టీడీపీ నేతలు ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్, పుల్లారావుయాదవ్‌తోపాటు రేవంత్ డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డిని ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు అధికారులు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించారు. వారి నుంచి కేసుకు సంబంధించి కొంత సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా మే 30, 31వ తేదీల్లో కార్యకలాపాల కేంద్రంగా విచారణ కొనసాగినట్లు సమాచారం. ఆ రెండు రోజుల్లో ఈ ఐదుగురూ ఎక్కడెక్కడికి వెళ్లారు, ఫోన్‌కాల్స్ వెళ్లిన సమయాల్లో ఎక్కడున్నారు, ఫోన్లు చేసిన ముఖ్యనేతలు ఏం మాట్లాడారు, వారితో మీకున్న సంబంధాలేమిటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. మరోవైపు రేవంత్ తన గన్‌మెన్‌ను వదిలేసి రెండు, మూడుసార్లు ఒంటరి వెళ్లడంపై రాఘవేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇక ఈ కేసును కొలిక్కి తీసుకురావడంతో పాటు సాక్ష్యాధారాలను పక్కాగా సిద్ధం చేయాలంటే మరికొంత మందిని విచారించాల్సి ఉందని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ మేరకు త్వరలో మరికొందరికి నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పాయి. కాగా.. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం కేవలం స్టీఫెన్‌సన్‌కే పరిమితం కాదని.. దీనివెనుక పెద్ద కుట్రే ఉందని ఏసీబీ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ఒక ఎమ్మెల్యే కొనుగోలుకు ఈస్థాయిలో పథక రచన, ఇంత మంది సహకారం అవసరం లేదని అంచనా వేస్తోంది. దీనివెనుక వ్యవస్థీకృత నేరమేదో ఉండి ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.