ఉరి అమలు ఇలా | what is the procedure of execution | Sakshi
Sakshi News home page

ఉరి అమలు ఇలా

Published Thu, Jul 30 2015 8:10 AM | Last Updated on Mon, Aug 27 2018 8:24 PM

ఉరి అమలు ఇలా - Sakshi

ఉరి అమలు ఇలా

జైలు మాన్యువల్ ప్రకారం.. యాకూబ్ మెమన్‌ను గురువారం వేకుజామున నిద్ర లేపారు. స్నానాదికాలు పూర్తయ్యాక తేలిగ్గా ఉండే ఆహారం అందించారు. తర్వాత ప్రార్థన చేసుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఇచ్చారు. మరణశిక్ష అమలు చేసే ముందు వైద్యులు మెమన్‌ను పరీక్షించి, తర్వాత ఉరికంబం వద్దకు తీసుకెళ్లారు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎంఎం దేశ్‌పాండే టాడా కోర్టు ఉత్తర్వుల్లోని ఉరిశిక్ష అమలు భాగాన్ని మెమన్‌కు చదివి వినిపించారు. మేజిస్ట్రేట్ నుంచి ఆదేశాలు రాగానే తలారి తన చేతిలో ఉన్న లివర్‌ను లాగి, ఉరిశిక్ష అమలు చేశాడు. అరగంట పాటు ఆ శరీరం అలాగే ఉరికంబంపై వేలాడుతూ ఉండాలని జైలు మాన్యువల్ స్పష్టం చేస్తోంది. ఆ తరువాత వైద్యుడు పరీక్షించి, చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఆ తరువాత పోస్ట్‌మార్టం ప్రక్రియ ఉంటుంది. ఉరి అమలు చేసే ముందు, మెమన్ బరువును ఉరికంబం, ఉరితాడు తట్టుకోగలదా? లేదా? అనే విషయాన్ని పరీక్షించారు. మెమన్ బరువుకు ఒకటిన్నర బరువున్న వస్తువుతో ప్రయోగం చేసి ఆ విషయాన్ని నిర్ధారించారు. ఎరవాడ జైల్లో అఫ్జల్ కసబ్‌ను ఉరితీసిన బృందాన్ని మెమన్ ఉరి ప్రక్రియను పర్యవేక్షించేందుకు నాగపూర్ జైలుకు రప్పించారు.
 
పదేళ్లలో నాలుగోది
యాకుబ్ మెమన్ ఉరితీతతో కలిపి భారత్‌లో గత పదేళ్లలో నాలుగు ఉరిశిక్షలు మాత్రమే అమలయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2004-2013 మధ్య దేశంలోని కోర్టులు ఏకంగా 1,303 మందికి మరణశిక్షలు విధించాయి. వీరిలో ముగ్గురే ఉరికంబమెక్కారు. ఓ టీనేజీ అమ్మాయిని రేప్ చేసి చంపిన వాచ్‌మన్ ధనంజయ్ ఛటర్జీని 2004 ఆగస్టు14న బెంగాల్‌లోని అలిపోర్ జైలులో ఉరితీశారు. 2008 ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ కసాయి కసబ్ ను 2012 నవంబరు 12న పుణే యెరవాడ జైల్లో ఉరితీశారు.  2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడింది)ను తీహార్ జైలులో ఉరి తీశారు. గత పదేళ్లలో ఉరికంబమెక్కిన వారిలో యాకుబ్ నాలుగోవాడు కానున్నాడు. ఈ పదేళ్ల కాలంలో 3,751 ఉరిశిక్షలను వివిధ కోర్టులు జీవితఖైదుగా మార్చాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement