చాటింగ్ కోసం వాట్సప్ కొత్త ఫీచర్
వాట్సప్ చాటింగ్ బాగా అలవాటైందా? అయితే... ఒకే రకం ఫాంటుతో చాట్ చేసి బోర్ కొడుతోంది కదూ.. అందుకే, మీ కోసమే ఫాంటు మార్చుకునే అవకాశాన్ని కూడా వాట్సప్ పరిశీలిస్తోంది. ఇక మీదట మీకు నచ్చినవాళ్లతో నచ్చిన ఫాంటులో చాట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర‍్లు వాడుకునేందుకు వీలుగా ఈ కొత్త ఫాంట్లను ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. ఇది కూడా ఏమాత్రం ప్రచార ఆర్భాటం లేకుండా సైలెంటుగా ప్రవేశపెట్టిందట. విండోస్లో ఉండే ‘ఫిక్స్డ్సిస్’ లాగే ఈ కొత్త ఫాంట్ కూడా ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే.
ప్రస్తుతానికి ఈ కొత్త ఫాంటును వాడటం మాత్రం చాలా కష్టమేనని అంటున్నారు. ఎందుకంటే, ఫాంటు మారాలంటే ఆ టెక్స్ట్కు ముందు, వెనక రెండుసార్లు బ్యాక్కోట్ (`) సింబల్ను యూజర్లు వాడాల్సి ఉంటుందట. అంటే మీరు ఎవరినైనా పలకరిస్తూ ఎలా ఉన్నారు అని కొత్త ఫాంటులో అడగాలంటే.. ```ఎలా ఉన్నారు``` అని టైప్ చేయాలన్న మాట. అయితే, పాత ఫాంటుతో పోలిస్తే కొత్త ఫాంట్ మాత్రం అక్షరాలు కొంత చిన్నగా కనపడుతున్నాయని యూజర్లు అంటున్నారు. అలాగే ప్రతిసారీ ఇలా కోట్స్ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా ఫాంట్ మార్చుకునే పద్ధతి ఉంటే చూడాలని కోరుతున్నారు. అలాగే బోల్డ్, ఇటాలిక్స్ లాంటివి పెడితే ఫాంటు మారట్లేదట. ప్రస్తుతానికి కేవలం ఆండ్రాయిడ్లోనే ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే ఐఓఎస్లో కూడా వస్తుందని చెబుతున్నారు.