మైదానంలో కోహ్లి ఉన్నా కెప్టెన్ ధోనీ??
కోల్‌కతా: వన్డేల్లోనూ పూర్తిస్థాయి సారథ్య పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లి ఇప్పటికే తన నాయకత్వంలో తొలి వన్డే సిరీస్‌ను కూడా గెలుపొందాడు. 50 ఓవర్ల మ్యాచులలో అతను సారథిగా పగ్గాలు చేపట్టినా.. ఇప్పటికీ మహేంద్రసింగ్ ధోనీయే కెప్టెన్ అనుకొని పొరబడుతున్నవారు చాలామందే కనిపిస్తున్నారు. వన్డేలు, టీ-20లలో సైతం టీమిండియా కెప్టెన్ బాధ్యతల నుంచి ధోనీ హుందాగా తప్పుకొన్న సంగతి తెలిసిందే.
అయినా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో మూడో వన్డే సందర్భంగా మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రెకర్ సైతం ఇలాగే పొరపడ్డారు. కామెంటరీలో ధోనీని కెప్టెన్ అని సంబోధించిన ఆయన.. ఆ వెంటనే నాలుక కరుచుకొని.. మాజీ కెప్టెన్ అంటూ సవరించుకున్నారు. ఇంగ్లండ్ ఇన్సింగ్స్ 15వ ఓవర్‌లో యువరాజ్ సింగ్ విసిరిన బంతిని స్వీప్ షాట్ ఆడబోయాడు సామ్ బిలింగ్స్. కానీ బంతి అతని ప్యాడ్స్‌కు తాకింది. దీంతో యూవీ, ధోనీ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. ఎంపైర్ తిరస్కరించారు. దీంతో రివ్యూకు వెళ్లాలా? వద్దా? అని కోహ్లి ధోనీ సలహాను తీసుకున్నాడు. రివ్యూకు వెళ్లవద్దని టీమిండియా నిర్ణయించింది. దీనిపై స్పందిస్తూ కెప్టెన్ సలహా మేరకు రివ్యూ ఆలోచనను కోహ్లి మానుకున్నాడంటూ మంజ్రెకర్ కామెంట్ చేశాడు. ఆ వెంటనే తనను తాను సవరించుకుంటూ మాజీ కెప్టెన్ సలహా మేరకు అంటూ పేర్కొన్నాడు.