
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలెప్పడు ?
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏడాది క్రితం ఆదేశిస్తే కేవలం పంచాయతీ ఎన్నికలు మాత్రమే పెట్టారని... ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
- ఎప్పుడు నిర్వహిస్తారో ఆ తేదీలతో కౌంటర్ వేయండి
- రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌లకు ‘సుప్రీం’ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏడాది క్రితం ఆదేశిస్తే కేవలం పంచాయతీ ఎన్నికలు మాత్రమే పెట్టారని... ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది అనుమోలు వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు గత ఏడాది ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పూర్తిగా అమలుచేయలేదని వివరించారు.
దీనికి తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నివేదించింది. అయితే లోక్‌సభ సాధారణ ఎన్నికల తరువాత ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. ఆ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తేదీలు పేర్కొంటూ రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌లను ఆదేశించింది.
పురపాలక ఎన్నికలపై ప్రభుత్వం ఎస్‌ఎల్పీ....
పురపాలక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ) దాఖలు చేసింది. నాలుగు వారాల్లో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి దీన్ని దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, విద్యార్థులకు పరీక్షలు కూడా ప్రారంభమవుతున్నందున ఉపాధ్యాయులు, పాఠశాలలు అందుబాటులో ఉండే అవకాశం లేదని అందులో వివరించినట్లు సమాచారం.