సిక్కు అమ్మాయిపై 'తెల్లోడి' పైత్యం
సిక్కు-అమెరికన్ అమ్మాయిపై ఓ శ్వేతజాతీయుడు తన జాతివిద్వేష పైత్యాన్ని వెళ్లగక్కాడు. ఆమెను చూసి మధ్యప్రాచ్యపు యువతిగా భావించిన అతడు.. 'నువ్వు ఈ దేశానికి చెందినదానికి కావు.. లెబనాన్ తిరిగి వెళ్లిపో' అంటూ కేకలు వేశాడు. దక్షిణాసియా వాసులపై అమెరికాలో విద్వేష నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల మ్యాన్‌హట్టన్‌లో ఈ ఘటన జరిగింది. తన స్నేహితురాలి పుట్టినరోజు వేడకకు వెళ్లేందుకు రాజ్‌ప్రీత్ హేర్ సబ్‌వే రైలులో బయలుదేరింది.
రైలులో తాను తన ఫోన్ చూస్తుండగా ఓ శ్వేతజాతీయుడు తనవద్దకు వచ్చి అరవడం మొదలుపెట్టాడని, తనను ఉద్దేశించి పరుషమైన, తీవ్ర వ్యాఖ్యలు చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన ఎదుర్కొన్న భయానక అనుభవం గురించి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించే 'దిస్ విక్ ఇన్ హేట్'లో ఆమె వివరించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్వేష నేరాలను ఈ కాలమ్ కింద న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేకంగా ప్రచురిస్తున్నది.