ఉఫాలో ఎందుకు లేవనెత్తలేదు? | Why Didn't Pakistan Raise Kashmir in Ufa, Asks Home Minister Rajnath Singh | Sakshi
Sakshi News home page

ఉఫాలో ఎందుకు లేవనెత్తలేదు?

Published Mon, Aug 24 2015 1:04 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

గిలానీ గృహనిర్బంధాన్ని నిరసిస్తూ శ్రీనగర్‌లో ఆందోళన చేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జి దృశ్యం - Sakshi

గిలానీ గృహనిర్బంధాన్ని నిరసిస్తూ శ్రీనగర్‌లో ఆందోళన చేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జి దృశ్యం

కశ్మీర్ అంశంపై పాక్‌కు హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రశ్న
* భారత్-పాక్ చర్చల రద్దుపై రాజకీయ పార్టీల విచారం
* పాక్ తప్పుకోవడానికి ప్రభుత్వం అవకాశమిచ్చింది: కాంగ్రెస్
* ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ప్రపంచం ఎదుట బయటపెట్టాం: బీజేపీ
న్యూఢిల్లీ/శ్రీనగర్: భారత్-పాకిస్తాన్‌ల మధ్య జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్‌ఎస్‌ఏ) స్థాయి చర్చలు రద్దవటం పట్ల కేంద్ర ప్రభుత్వం సహా వివిధ రాజకీయ పార్టీలు విచారం వ్యక్తం చేశాయి. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటంపై ఎంతో ఆసక్తిగా ఉన్న పాక్.. ఆ అంశాన్ని ఉఫాలో ఎందుకు లేవనెత్తలేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశ్నించారు.

ఎన్‌ఎస్‌ఏ చర్చలకు ఉఫాలో నిర్ణయించిన ఎజెండా నుంచి పాక్ పక్కకు మళ్లాల్సింది కాదన్నారు. పొరుగుదేశంతో స్నేహసంబంధాలకు భారత్ ఎప్పుడూ సానుకూలంగా ఉందని, ఆ దిశగా కృషి కొనసాగుతుందని అన్నారు. అయితే.. ప్రభుత్వం పాక్ ఆడిన ఆటలో పావుగా మారిందని, ఉగ్రవాదంపై చర్చల నుంచి పాక్ తప్పించుకోవటానికి అవకాశమిచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ధ్వజమెత్తింది. కానీ.. ఈ చర్చల నుంచి తప్పుకున్న పాక్ వైఖరిని ప్రపంచం ఎదుట తమ సర్కారు బట్టబయలు చేసిందని అధికార బీజేపీ పేర్కొంది.

ప్రతి ద్వైపాక్షిక చర్చల్లో అందరి భాగస్వామ్యం కోసం పట్టుపట్టటం వాంఛనీయం కాదని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్  సయీద్  పేర్కొన్నారు. భారత ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వేర్పాటువాద హురియత్ నేతలు విమర్శించారు. చర్చలు రద్దుకావటానికి కారణం వారేనని, వెనక్కు తగ్గి ఉండాల్సిందని కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తప్పుపట్టారు. భారత్ - పాక్‌ల మధ్య చర్చలు రద్దుకావటం పట్ల అమెరికా నిరాశ వ్యక్తంచేసింది.

ఇరు దేశాలూ త్వరలో చర్చలు పునరుద్ధరించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు. ఉఫాలో భారత్, పాక్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు నిర్ణయించిన మేరకు.. పాక్ ఎన్‌ఎస్‌ఏ సర్తాజ్ అజీజ్ సోమవారం ఢిల్లీలో భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌తో సమావేశమై చర్చలు జరపాల్సి ఉండగా.. అజీజ్ ఢిల్లీలో హురియత్ నేతలను కలవరాదని, చర్చల్లో ఉగ్రవాదం మినహా మరో అంశాన్ని లేవనెత్తరాదని భారత్ స్పష్టంచేయటంతో పాక్ ఆ చర్చలను శనివారం నాడు రద్దుచేసుకున్న విషయం తెలిసిందే.

పాక్ నేతలు భారత్ వచ్చినపుడు హురియత్ నేతలను కలవటం మామూలేనని, కశ్మీర్ అంశం లేనిదే చర్చలు నిష్ర్పయోజనమని పేర్కొన్న పాక్.. ఈ అంశాలపై భారత్ ముందస్తు షరతులు పెడుతోందని ఆరోపిస్తూ చర్చలు రద్దుచేసుకుంది. అయితే.. తాము ముందస్తు షరతులు పెట్టలేదని.. ఉఫాలో ఒప్పందం సందర్భంగా నిర్ణయించిన ఎజెండా ప్రకారం కేవలం ఉగ్రవాదం, దానికి సంబంధించిన అంశాలపైనే చర్చ జరపాలని, సిమ్లా ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక చర్చల్లో మూడో పక్షానికి తావులేదని.. ఈ రెండు ఒప్పందాల స్ఫూర్తిని గౌరవించాలని మాత్రమే తాము చెప్తున్నామని భారత ప్రభుత్వం పేర్కొన్న విషయమూ విదితమే. ఈ పరిణామాలపై ఆయా పార్టీల ప్రతిస్పందనలివీ...
 
మూడో పక్షానికి తావులేదు: కేంద్రం
‘‘కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటంపై ఎంతో ఆసక్తిగా ఉన్న పాక్ ఉఫాలో ఇరు దేశాల ప్రధానులు కలిసినప్పుడు ఆ విషయాన్ని ఎందుకు లేవనెత్తలేదు? అది ఎజెండాలో ఎన్నడూ లేదు. ఎన్‌ఎస్‌ఏల చర్చలు రద్దుకావటం విచారకరం. ఉఫాలో ఇరువురు ప్రధానుల సమావేశం సందర్భంగా నిర్ణయించిన ఎజెండా నుంచి పాక్ దారిమళ్లాల్సింది కాదు. ఎన్‌ఎస్‌ఏ చర్చల్లో మూడో పక్షానికి (హురియత్) తావులేదు. ఈ చర్చలకు ముందు కానీ, మధ్యలో కానీ, తర్వాత కానీ ఇతరులతో చర్చలు జరపటమనే ప్రశ్నే లేదు. ముందు నిర్ణయించినట్లు ఉగ్రవాదంపై పాక్ చర్చలు జరపాల్సింది.  భవిష్యత్తులో ఎలాంటి చర్చలైనా సాధ్యమవుతాయా లేదా అన్నది పాక్ పైనా ఆధారపడి ఉంది.’’
 - రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంమంత్రి  
 
పాక్ ఆటలో పావు అయింది: కాంగ్రెస్
‘‘పాక్ ఆడిన ఆటలో కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా లేకపోవటం, సంసిద్ధంగా లేకపోవటం, దృష్టి కేంద్రీకరించి లేకపోవటం వల్ల పావుగా మారింది. ఉగ్రవాదంపై చర్చల నుంచి తప్పుకుపోవటానికి ఆ దేశానికి అవకాశమిచ్చింది.’’
 - అభిషేక్‌సింఘ్వీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
 
పాక్ వైఖరి తేటతెల్లమైంది: బీజేపీ
‘‘చర్చల నుంచి పాక్ వైదొలగటం చాలా విచారకరం. ఉగ్రవాదంపై చర్చిస్తే ప్రపంచం ఎదుట తన బండారం బయటపడుతుందని పాక్‌కు తెలుసు. చర్చల నుంచి పాక్ వైదొలగటంతో.. ఉగ్రవాదం విషయంలో ప్రపంచ వేదికపై ఆ దేశ వైఖరిని మా ప్రభుత్వం బట్టబయలు చేసింది.’’  
 - సంబిత్‌పాత్రా, బీజేపీ అధికార ప్రతినిధి

‘‘వేర్పాటు నేతలను కలవాలని పాక్ ఎన్‌ఎస్‌ఏ పట్టుపట్టటం సరికాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎస్‌పీ పూర్తి మద్దతు ఇస్తోంది.’’
- రామ్‌గోపాల్‌యాదవ్, ఎస్‌పీ నేత
 
‘‘హురియత్ నేతలు పాక్ దౌత్యకార్యాలయంలో కార్యక్రమానికి హాజరుకాకుండా ఏ చట్టం కింద నిరోధించవచ్చు? మోదీ నరేంద్రమోదీ మాట్లాడాలి. నా జీవితంలో అత్యంత నిరుత్సాహకరమైన వ్యక్తి ఆయన.’’
- రాంజెఠ్మలాని, బీజేపీ మాజీ నేత
 
లేహ్‌లో పారికర్ పర్యటన.. లదాఖ్ సరిహద్దుల వెంట, సీమాంతర చొరబాట్ల విషయంలో రక్షణ సంసిద్ధత సహా జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఉన్నతస్థాయి సైనికాధికారులతో సమీక్షించారు. లదాఖ్ పర్యటనలో భాగంగా పారికర్ సైన్యం చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్‌తో కలిసి ఆదివారం లేహ్ వచ్చారు.
 
భారత్‌ను తప్పుపట్టిన పాక్ మీడియా
భారత్-పాక్‌ల మధ్య ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలు రద్దుకావటానికి.. ముందస్తు షరతులు పెట్టిన భారత్ వైఖరే కారణమని పాక్ మీడియా తప్పుపట్టింది. ప్రధాన వార్తాపత్రికలన్నీ చర్చల రద్దు కావటంపై ఆదివారం తొలి పేజీలో కథనాలు ప్రచురించాయి. పాక్ ఎన్‌ఎస్‌ఏ ఢిల్లీలో భారత్ ఎన్‌ఎస్‌ఏను కలసి ఉగ్రవాదం సహా అన్ని అంశాలపైనా చర్చించాల్సి ఉందని.. కానీ భారత్ ముందస్తు షరతులు పెట్టిందని.. దానివల్లే చర్చలు రద్దయ్యాయని విమర్శించాయి. డాన్, న్యూ ఇంటర్నేషనల్, ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తదితర పత్రికలు భారత్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి.
 
గిలానీ సదస్సు ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు
శ్రీనగర్: అతివాద హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ గిలానీ ఆదివారం శ్రీనగర్‌లోని తన నివాసంలో పార్టీ సదస్సు నిర్వహించటానికి చేసిన ప్రయత్నాన్ని ప్రభుత్వాధికారులు విఫలం చేశారు. హైదర్‌పోరాలోని గిలానీ నివాసానికి వెళ్లే ఎయిర్‌పోర్ట్ రోడ్ వెంట భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి దారిని మూసివేశారు.

దీంతో ఆగ్రహించిన హురియత్ కార్యకర్తలు సమీపంలోని ప్రార్థనామందిరం వద్ద సమావేశమై.. పోలీసు వలయం నుంచి దూసుకెళ్లటానికి ప్రయత్నించారు. కార్యకర్తలకు, పోలీసులకు ఘర్షణ తలెత్తింది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కానన్, లాఠీలు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు.
 
డీజీఎంఓ చర్చలు జరుగుతాయి: పాక్
ఇస్లామాబాద్: ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలను రద్దు చేసుకున్న పాకిస్తాన్.. ఆ మరుసటి రోజే రెండు దేశాల డీజీఎంఓల (డెరైక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) భేటీలు యథావిధిగా జరుగుతాయని పేర్కొంది. ఉఫా ప్రకటన మేరకు పాక్ రేంజర్లు - బీఎస్‌ఎఫ్ ప్రతినిధుల చర్చలు జరుగుతాయని పాక్ ఎన్‌ఎస్‌ఏ సర్తాజ్ అజీజ్ ఆదివారం  వెల్లడించారు. వచ్చే నెల 6న నిర్ణయించిన ఈ భేటీకి.. మరింత వ్యవస్థీకరణ అవసరమన్నారు. ఎన్‌ఎస్‌ఏ చర్చల రద్దుకు భారతే కారణమన్నారు. ‘‘కశ్మీర్ అంశంపై చర్చలు జరపటం ఉద్రిక్తతను తగ్గిస్తుంది. ఉఫా భేటీ లక్ష్యం.. ఉద్రిక్తతను తగ్గించటం. కాబట్టి కశ్మీర్‌పై చర్చించాల్సిన అవసరముంది’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement