క్రిస్ గేల్‌పై ఎందుకు వేటు వేశారు?
తాజా ఐపీఎల్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో ఓడిపోయినప్పటికీ.. ఏబీ డివిలియర్స్ తుది జట్టులోకి రావడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్‌లో కొండంత ఉత్సాహాన్ని నింపింది. తాజాగా పంజాబ్ తో మ్యాచ్‌లో 49 బంతుల్లోనే 89 పరుగులు చేసిన డివిలియర్స్ జట్టు చెప్పుకోదగిన స్కోరు చేయడంలో సహాయపడ్డాడు. అయితే, డివిలియర్స్ జట్టులోకి ఎంటర్ కావడంతో మరో స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌పై వేటు పడింది. డివిలియర్స్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో బెంగళూరు తుది జట్టులో అతనికి చోటు లభించే పరిస్థితి లేదు. మరో 25 పరుగులు చేస్తే టీ20లలో 10వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా గేల్ రికార్డు సృష్టించబోతున్నాడు. అయితే, ఇప్పట్లో అతను జట్టులోకి వచ్చే పరిస్థితి లేదని బెంగళూరు టీమ్ పేర్కొంటున్నది.
‘షేన్ వాట్సన్ తన కెరీర్ మొత్తం టాప్ ఆర్డర్‌లోనే ఆడాడు. ఇప్పుడు అతని బ్యాటింగ్ పొజిషన్ను మార్చే ప్రసక్తే లేదు. కాబట్టి డివిలియర్స్‌ను జట్టులోకి తీసుకోవాలంటే గేల్‌ను తప్పించడం తప్ప మరో మార్గం లేదు. ఇది వ్యూహాత్మక నిర్ణయం కాదు. కానీ మాకు వేరే చాయిస్ లేకే ఇలా చేస్తున్నాం. డివిలియర్స్ ఫిట్‌గా ఉన్నంతకాలం అతను తుది జట్టులో కొనసాగుతాడు’ అని ఆర్సీబీ ఆల్‌రౌండర్ స్టువార్ట్ బిన్నీ స్పష్టం చేశారు. వెన్నునొప్పితో కోలుకున్న డివిలియర్స్, వాట్సన్‌తోపాటు మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు తైమల్ మిల్స్, బిల్లీ స్టాన్లకే పంజాబ్‌తో మ్యాచ్‌లో జట్టులో చోటు సంపాదించారు. మిల్స్, బిల్లీ ఇద్దరూ ఫాస్ట్ బౌలర్లే. విరాట్ కోహ్లి గైర్హాజరీలో ఆర్సీబీ ఇప్పటివరకు బ్యాటింగ్‌లో పెద్దగా చెలరేగలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లలో ఒకరిని తప్పించి రానున్న మ్యాచ్‌కు జట్టులోకి గేల్‌ను తీసుకొనే అవకాశముందని భావిస్తున్నారు.