తీస్తాపై మోదీకి ఎందుకంత కక్ష ? | Why Narendra Modi hunt Teesta Setalvad | Sakshi
Sakshi News home page

తీస్తాపై మోదీకి ఎందుకంత కక్ష ?

Published Wed, Jul 15 2015 2:20 PM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM

తీస్తాపై మోదీకి ఎందుకంత కక్ష ? - Sakshi

తీస్తాపై మోదీకి ఎందుకంత కక్ష ?

ముంబై: తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం, నేడు ఎన్జీవో సంస్థల ద్వారా ప్రజా సేవ చేస్తున్న ఓ మహిళ వెంట పడుతోంది. ఆవిడను వేధింపులకు గురిచేస్తోంది. ఆమెను రాజీ దారిలోకి రప్పించేందుకు లేదా కటకటాల వెనక్కి నెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

ఆమెపై భారతీయ శిక్షా స్మృతిలోని 120 బీ సెక్షన్ కింద నేరపూరిత కుట్ర, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం-1976, 2010లలోని వివిధ సెక్షన్ల కింద జూలై ఎనిమిదవ తేదీన కేసు నమోదు చేసింది. దర్యాప్తు పేరిట వేధింపులు ప్రారంభించింది. అందులో భాగంగానే సీబీఐ అధికారులు మంగళవారం నాడు ముంబై నగరంలోని ఆమె నివాసం, ఆమె నిర్వహిస్తున్న ఎన్జీవో సంస్థల కార్యాలయాలపైన ఏకకాలంలో నాలుగుచోట్ల దాడులు జరిపింది.

ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు గుజరాత్ ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళ పేరు తీస్తా సెతల్వాద్. ఆమె అంటే మోదీ ప్రభుత్వానికి ఎందుకంత ఆగ్రహమో, కక్షో సులభంగానే అర్థం చే సుకోవచ్చు. ప్రజలు ఎప్పుడో మరచిపోయిన 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసును ఆమె మరచిపోకపోవడమే. దానిపై ఇప్పటికీ పోరాటం కొనసాగిస్తుండడమే.

తీస్తా సెతల్వాద్ తన భర్త జావెద్ ఆనంద్‌తో కలసి సబ్రాంగ్ కమ్యూనికేషన్స్, సబ్రాంగ్ ట్రస్ట్, సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సంస్థలను స్థాపించి ప్రజల తరపున సామాజిక న్యాయం కోసం పోరాటం జరుపుతున్నారు. మొదటిసారి 2006లో గుజరాత్ పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. అప్పుడు నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అప్పుడు సరైన సాక్ష్యాధారాలు దొరక్కనో, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్లనో కేసు ముందుకు సాగలేదు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అంటే.. 2015, జూలై 8వ తేదీన ఆమెపై సీబీఐ తాజాగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. కేంద్ర హోం శాఖ ముందస్తు అనుమతి లేకుండా ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి 2.90 లక్షల రూపాయలను ఆమె నడుపుతున్న ట్రస్ట్ విరాళంగా తీసుకుందని ప్రధాన అభియోగం.

2002 గుజరాత్ అల్లర్ల నాటి నుంచే ప్రజల తరఫున సెతల్వాద్ పోరాటం ప్రారంభం కాలేదు. ఆమె ఓ సామాజిక కార్యకర్తగా 1993 నుంచే పోరాటం ప్రారంభించారు. తొలుత జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించిన సెతల్వాద్ 1992-93లో జరిగిన ముంబై హిందూ-ముస్లిం అల్లర్లకు చలించి పోయారు. ‘కమ్యూనలిజం కొంబాట్’ పేరిట ఓ మాగజైన్‌ను ఏర్పాటు చేసి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేపట్టారు. ఆమె తన భర్త ఆనంద్‌తో కలసి 1995లో సబ్రాంగ్ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. అప్పుడు వారి కార్యకలాపాలను ఎవరూ ప్రశ్నించలేదు. పైగా వారు చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు అంతర్జాతీయంగా ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు.

2002లో ‘సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్’ సంస్థను ప్రారంభించడంతో వారికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అల్లర్ల సందర్భంగా బాధితుల తరఫున పోరాడడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. బాధితుల నుంచి పిటిషన్లు వేయించడం, వారికి న్యాయనిపుణులను సమకూర్చడం, సాక్షులను సమీకరించడం, వారికి న్యాయం జరిగేలా చూడడం అ లక్ష్యంలో భాగం. ఈ సంస్థ పాత్ర కారణంగా నాటి 2002 గుజరాత్ అల్లర్ల కేసుల్లో 120 మంది దోషులకు శిక్ష పడింది. అయినప్పటికీ బడా రాజకీయవేత్తలు మాత్రం శిక్ష నుంచే కాకుండా కేసుల నుంచి కూడా తప్పించుకుతిరుగుతున్నారు.

గుజరాత్ అల్లర్లలో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ హత్యకు గురయ్యారు. ఈ అల్లర్లకు ప్రధాన కారకుడు నరేంద్ర మోదీ అని ఆరోపిస్తూ ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీతో కోర్టులో కేసు దాఖలు చేయించి అప్పటి నుంచి ఆమె తరపునే సెతల్వాద్ న్యాయపోరాటం చేస్తున్నారు. అహ్మదాబాద్ నుంచి సుప్రీంకోర్టు వరకు పలు కేసుల్లో వారు పోరాటం చేస్తున్నారు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోదీపై దర్యాప్తునకు సుప్రీం కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

దర్యాప్తు జరిపిన ఆ బృందం సరైన ఆధారాలు లేవంటూ మోదీ, ఆయన సన్నిహితులకు క్లీన్‌చిట్ ఇచ్చింది. దీనిపై జాఫ్రీ, సెతల్వాద్‌లు ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కూడా అడ్మిషన్ దశలో దిగువస్థాయి కోర్టు కొట్టివేసింది. అంతటితో పోరాటం ఆపని సెతల్వాద్ మళ్లీ పైకోర్టులో జాఫ్రీతోని ప్రొటెస్ట్ పిటిషన్ రివ్యూ పిటిషన్ 2014, మార్చి15న దాఖలు చేయించారు. దీనిపై అహ్మదాబాద్ కోర్టులో ఈ నెల 27వ తేదీన విచారణ జరుగనుంది.

ఈ నేపథ్యంలోనే గుజరాత్ క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు పాత  కేసును తిరగదోడారు. ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి విదేశీ విరాళాలను స్వీకరించడంలో సెతల్వాద్ ముందస్తుగా కేంద్ర హోం శాఖ నుంచి అనుమతి తీసుకున్నారా, లేదా అన్న అంశంలో వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ గుజరాత్ పోలీసులు కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోం శాఖ వెంటనే నేరుగా సీబీఐని రంగంలోకి దింపి సెతల్వాద్ తదితరులపైన ఎప్‌ఐఆర్ దాఖలు చేయించింది. ఈ కేసు పర్యావసానమే మంగళవారం సెతల్వాద్ ఇంటిపై, కార్యాలయాలపై సీబీఐ దాడులు జరగడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement