ప్రధాని మోదీకి ఒవైసీ సూటి ప్రశ్న
ముంబై: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో భాగంగా ఆదివారం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన.. మరాఠా రాజు శివాజీ స్మారకస్థూపానికి భూమిపూజ సందర్భంగా శివాజీ సైన్యంలో సేవలు అందించిన ముస్లింల గురించి ప్రధాని మోదీ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.
‘శివాజీ మెమోరియల్ కోసం రూ. 3,600 కోట్లు ఖర్చు పెట్టడాన్ని మేం వ్యతిరేకించడం లేదు. కానీ ప్రధాని మోదీ శివాజీ గొప్పతనం గురించి మాట్లాడుతూ.. ఎందుకు ముస్లింల కృషి గురించి ప్రస్తావించలేదు. శివాజీ సైన్యంలో భాగంగా ఉండి, ఆయన కోసం పలువురు ముస్లింలు ప్రాణాలు విడిచారు’ అని ఒవైసీ ఎన్నికల సభలో అన్నారు.
‘శివాజీ ఎన్నడూ రైతుల భూములను లాక్కోలేదు. అందుకే ఆయనను ప్రజలు ఇష్టపడ్డారు. ఇప్పుడు శివాజీ బతికి ఉంటే.. తన పేరు వాడుకొని, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నవారిని ఆయన ఏం చేసి ఉండేవారో’ అని ఒవైసీ విమర్శించారు.