
రాష్ట్రపతి ఎన్నిక: నితీశ్‌కు లాలూ విజ్ఞప్తి!
చారిత్రక తప్పిదాన్ని చేయొద్దంటూ ఆయనకు విజ్ఞప్తి చేస్తాం. ఆయన నిర్ణయం తప్పు. పునరాలోచన చేయాల్సిందిగా ఆయనను కోరుతున్నాం.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థిగా దళిత మహిళ, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను ప్రకటించిన ప్రతిపక్షాలు.. విపక్షాల ఐక్యత కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. విపక్షం గూటి నుంచి జారుకొని అధికార ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపిన బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ను తిరిగి తమవైపు తిప్పుకునే దిశగా అడుగులు వేశాయి. ప్రతిపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతు తెలుపాల్సిందిగా నితీశ్‌ను విజ్ఞప్తి చేశాయి.
'మేం నితీశ్‌తో శుక్రవారం భేటీ అయి.. బిహార్ బిడ్డ అయిన మీరాకుమార్‌కు మద్దతు తెలుపాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తాం' అని లాలూ రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్షాల భేటీ అనంతరం తెలిపారు. 'మేం నితీశ్‌తో భేటీలో చారిత్రక తప్పిదాన్ని చేయొద్దంటూ ఆయనకు విజ్ఞప్తి చేస్తాం. ఆయన నిర్ణయం తప్పు. పునరాలోచన చేయాల్సిందిగా ఆయనను కోరుతున్నాం. ఆయన ప్రతిపక్ష కూటమిని విచ్ఛిన్నం చేయకూడదు' అని లాలూ అన్నారు. నితీశ్ సంకీర్ణ ప్రభుత్వంలో లాలూ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే. మిత్రపక్షాల షాక్ ఇస్తూ ఆయన బీజేపీ అభ్యర్థి కోవింద్‌కు మద్దతు పలుకడంతో లాలూ, నితీశ్ మధ్య మాటలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తిరిగి తమ గూటికే రావాల్సిందిగా లాలూ నితీశ్‌ను కోరుతున్నారు.