
విప్రో: లాభం 8% అప్
బెంగళూరు: హెల్త్‌కేర్, ఇన్‌ఫ్రా సేవల విభాగాల ఊతంతో ఐటీ దిగ్గజం విప్రో నికర లాభం మూడో త్రైమాసికంలో 8 శాతం ఎగిసింది. శుక్రవారం వెల్లడించిన ఆర్థిక ఫలితాల ప్రకారం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.2,193 కోట్లకు పెరిగింది. ఆదాయం సైతం 7 శాతం పెరిగి రూ. 12,085 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఆదాయం రూ. 11,327 కోట్లు కాగా, లాభం రూ. 2,015 కోట్లు. దేశీయంగా మూడో అతి పెద్ద ఐటీ సంస్థ అయిన విప్రో.. తాజాగా క్యూ3లో డాలర్ మారకంలో ఐటీ సర్వీసుల విభాగం ఆదాయాలు 1.8-1.84 బిలియన్ల మేర ఉండొచ్చని అంచనా వేసినప్పటికీ.. 1.79 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో 1.81-1.85 బిలియన్ డాలర్ల మేర ఆదాయాలు ఉండొచ్చని విప్రో తాజాగా గెడైన్స్ ఇచ్చింది. రూ. 2 ముఖవిలువ గల షేరుపై రూ. 5 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండు ప్రకటించింది.
కరెన్సీ ప్రభావం పడింది: అంతర్జాతీయంగా కరెన్సీ, కమోడిటీ మార్కెట్ల పరిణామాలు ప్రధాన ఎకానమీలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ చెప్పారు. ఐటీ సేవల విభాగం ఆదాయాలు క్రితం త్రైమాసికంతో పోలిస్తే 3.7 శాతం మేర పెరిగాయని విప్రో సీఈవో టీకే కురియన్ తెలిపారు. ఉత్తర అమెరికా, యూరప్ వంటి కీలక మార్కెట్లలో ఐటీ సేవలకు డిమాండు స్థిరంగా ఉన్నట్లు తెలియజేశారు. యూరప్, భారత్‌లో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసులకు డిమాండు యథాతథంగా కొనసాగవచ్చని.. రిటైల్, తయారీ రంగాల్లో మళ్లీ డిమాండు పుంజుకోగలదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తగ్గిన అట్రిషన్: డిసెంబర్ ఆఖరుకు కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,56,866గా ఉంది. అట్రిషన్ రేటు 16.9 శాతం నుంచి 16.4 శాతానికి తగ్గింది. సురేష్ సేనాపతి రిటైర్మెంట్: చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సురేష్ సేనాపతి ఈ ఏడాది మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఫైనాన్స్ విభాగ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ దలాల్ బాధ్యతలు చేపడతారు.
ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో
0.79 శాతం క్షీణించి రూ.555.25 వద్ద ముగిసింది.