మహిళా ఖైదీపై అత్యంత క్రూరత్వం.. | Woman convict death case, FIR gives shocking details | Sakshi
Sakshi News home page

మహిళా ఖైదీపై అత్యంత క్రూరత్వం..

Published Tue, Jun 27 2017 11:46 AM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

మహిళా ఖైదీపై అత్యంత క్రూరత్వం..

మహిళా ఖైదీపై అత్యంత క్రూరత్వం..

తన ఉదయపు అల్పాహారంలో రెండు కోడిగుడ్లు, ఐదు బ్రెడ్డుముక్కలు తక్కువగా వచ్చాయని ఫిర్యాదు చేయడమే ఆ మహిళ ఖైదీ తప్పైంది. జైలర్లు ఆమెపై అత్యంత క్రూరంగా దాడి చేశారు. అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ఇది ముంబై బైకుల్లా జైలులో అనుమానాస్పదంగా మృతి చెందిన 38 ఏళ్ల మంజులా షెత్యే ఉదంతం ఇది. ఆమె మృతితో బైకుల్లా జైలులోని తోటి మహిళా ఖైదీలు ఆందోళనకు దిగి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ అలర్ల ఘటనలో ఇదే జైలులో ఉంటున్న మాజీ మీడియా అధిపతి ఇంద్రాణి ముఖర్జీ సహా పలువురు ఖైదీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంజుల మృతి ఉదంతంపై ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

మహిళా ఖైదీ అయిన మంజుల తన సత్ప్రవర్తన కారణంగా తన బ్యారక్‌ వార్డన్‌గా గుర్తింపు పొందింది. అయితే, ఈ నెల 23న ఉదయం 9 గంటలకు మంజుల తనకు ఇచ్చిన అల్పాహారంలో రెండు కోడిగుడ్లు, బ్రెడ్డు ముక్కలు తక్కువ ఇవ్వడంతో ఈ విషయాన్ని జైలు అధికారిణి మనీషా పోఖర్‌కర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో మనీషా పోఖర్‌కర్‌ ఆమెను తన ప్రైవేటు గదికి పిలిపించుకుందని, ఆ వెంటనే మంజుల బాధతో విలవిలలాడుతున్న అరుపులు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

బాధతో అల్లాడుతూ ఆమె తన బ్యారక్‌ తిరిగి వచ్చిందని, ఆ తర్వాత మహిళా కానిస్టేబుళ్లు (బిందు నాయ్‌కడే, వసీమా షైక్‌, షీతల్‌ షెగావంకర్‌, సురేఖ గుల్వే, ఆర్తీ షింగ్నే తదితరులు) ఆమె బ్యారక్‌లోకి వచ్చి తన దుస్తులు విప్పేసి నగ్నంగా మార్చారని, ఇద్దరు కానిస్టేబుళ్లు (బిందు, సురేఖ) ఆమె కాళ్లు విడదీయగా.. వసీమ ఆమె ప్రైవేటు అంగంలోకి లాఠీని దూర్చి కిరాతకంగా ప్రవర్తించిందని, దీంతో తీవ్ర రక్తస్రావమైన ఆమెకు ఎలాంటి వైద్యసాయం చేయలేదని, ఆమె బాత్‌రూంలో స్పృహ తప్పిపడిపోయిన తర్వాత మొదట రెసిడెంట్‌ డాక్టర్‌ వద్దకు, తర్వాత జేజే ఆస్పత్రికి తరలించారని సాక్షులు వివరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంజుల చనిపోయింది. ఈ ఘటనతో ఆగ్రహించిన మహిళా ఖైదీలు బైకులా జైలులో ఆందోళనకు, అల్లర్లకు దిగారు. ఈ ఘటనలో కూతురు షీనా బోర్రా హత్యకేసులో ఇదే జైలులో ఉంటున్న ఇంద్రాణి ముఖర్జీపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement