విమానంలో మహిళ మృతికి కారణాలేమిటి?
విమానంలో మహిళ మృతికి కారణాలేమిటి?
Published Thu, Jan 12 2017 9:06 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
ముంబాయి నుంచి వారణాసి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఓ 34 ఏళ్ల మహిళ మృతిచెందింది. విమాన సిబ్బంది నిర్లక్ష్యంతోనే విమానం ఆన్బోర్డింగ్ సమయంలో ఆ మహిళ ప్రాణాలు విడిచినట్టు ఆమె కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. మృతిచెందిన మహిళ పేరు సంగీత. వారణాసికి చెందిన ఆమె, తన భర్త, పాపతో కలిసి ఫ్లైట్ ఎస్జీ 704 విమానంలో ముంబాయి నుంచి వారణాసి వస్తున్నారు. మార్గం మధ్యలోకి రాగానే ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది.. వెంటనే కుటుంబసభ్యులు విమాన సిబ్బందికి సమాచారం అందించినా వారు వైద్య సహాయం అందించడంలో జాప్యం చేశారని ఆమె భర్త వాపోతున్నారు.
వెంటనే వైద్య సహాయం అందించకపోవడంతో తన భార్య మృతిచెందినట్టు భర్త ఆరోపిస్తున్నారు. అయితే సంగీతను విమానంలో డాక్టర్ పరీక్షించారని, కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడువని స్పైస్ జెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. సంగీతకు అవసరమైన వైద్యసహాయమంతా విమాన సిబ్బంది అందించారని పేర్కొంది. క్యాపిటన్ ఏటీసీకి సమాచారం అందించి, ల్యాండింగ్ సమయంలోనూ వైద్య సహాయం అందించారని స్పైస్ జెట్ తెలిపింది. విమానం ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని స్పైస్ జెట్ చెప్పింది.. అయితే మార్గం మధ్యలోనే సంగీత చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. సంగీత పోస్టుమార్టం రిపోర్టే ఆమె చనిపోవడానికి అసలు కారణాలేమిటో వెల్లడిస్తుందని స్పైస్ జెట్ పేర్కొంటోంది.
Advertisement