ఈ భయానక పరిస్థితి ఎప్పుడు మారుతుందో?
స్వేచ్ఛా భారతంలో పేదవాడికి వైద్యం అందని మానిపండులా మారింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో వడివడిగా అడుగులు వేస్తున్న భారతావని లేనోడికి మెరుగైన వైద్యం అందించే విషయంలో ఇంకా నేలచూపులు చూస్తోంది. నేతలు మారినా పేదల తలరాతలు మారడం లేదు. గరీబుకు గోరంత వైద్యం అందించే దవాఖాలు నేటికి దొరక్కపోవడం దేశ ప్రజల దౌర్భగ్యం. పేరు గొప్ప పాలకుల నిష్క్రియ నిరుపేదల పాలిట శాపంగా మారుతోంది.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమతలేక రోగోపశమనం కోసం సర్కారీ దవాఖాన మెట్లు ఎక్కుతున్న పేద రోగులకు చీదరింపులు ఎదురవుతున్నాయి. ఆస్పత్రిలో చేరే లోపు బడుగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పాలకులకు చీమ కుట్టినట్టు లేకపోవడం శోచనీయం. యథారాజ... చందంగా లంచాలు మరిగిన సర్కారీ సిబ్బంది బీదసాదల చావులకు కారణమవుతున్నారు.
లంచం ఇవ్వలేదన్న అక్కసుతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఇద్దరు రోగుల పట్ల నిర్దయగా వ్యవరించారు. అత్యవసరంగా వైద్యం అందాల్సివున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. సరైన వైద్యం అందకపోవడంతో లాల్బజార్ కు చెందిన డప్పు వాయిద్యకారుడు భార్య మంచానికే పరిమితమయింది.
ఇక పశ్చిమ బెంగాల్ లో ఉత్తర 24 పరగణాల జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వైద్యం కోసం వచ్చిన మహిళను అంబులెన్స్ డ్రైవర్ రోడ్డు పక్కన పడేసిపోవడంతో ఆమె మృతి చెందింది. ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో ఉదంతాలు సర్కారీ నిష్పూచికి నిలువుటద్దంలా నిలుస్తాయి. భగవంతుడా.. ఈ భయానక పరిస్థితి ఎప్పుడు మారుతుందో?