కేవలం సమోస కోసం సవతి తల్లి..!
బరేలి(ఉత్తరప్రదేశ్):
బడి నుంచి ఆకలితో ఇంటికొచ్చిన ఆ చిన్నారిని 'సమోసల' గొడవ బలితీసుకుంది. ఆకలితో ఉన్న అతను సమోసాలన్నింటినీ తానే తినేయడంతో విచక్షణ కోల్పోయిన సవతి తల్లి అతన్ని గొంతు నులిమి చంపేసింది. ఈ కిరాతక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలోని కౌంటాండ గ్రామంలో జరిగింది.
షాహీద్ ఆలీ మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ద్వారా అతనికి ఇద్దరు పిల్లలు కలిగారు. అతని ఆరేళ్ల కొడుకు పాఠశాల నుంచి తిరిగొచ్చి.. అన్నం పెట్టాల్సిందిగా సవతి తల్లిని కోరాడు. ఆ చిన్నారికి ఆమె కొంత డబ్బు ఇచ్చి.. సమీపంలోని దుకాణంలో సమోసాలు తీసుకురమ్మని పంపింది. అయితే, ఆకలితో ఉన్న ఆ బాలుడు సమోసాలు ఇంటికి తీసుకురాకుండా.. అన్నీ తానే తినేశాడు. దీంతో కోపంలో విచక్షణ కోల్పోయిన ఆమె చిన్నారిని గొంతు నులిమి చంపేసింది. ఇంటికి వచ్చి జరిగిన కొడుకు చనిపోయిన విషయాన్ని గుర్తించిన షాహిద్ ఆలీ పోలీసులకు ఫిర్యాడు చేశాడు. దీంతో నిందితురాలైన సవతి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు.