ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపిన మహిళ
హూస్టన్: ఇంట్లో మొదలైన చిన్న వాగ్వాదం తీవ్ర విషాదానికి దారితీసింది. కన్న తల్లే తన టీనేజ్ కూతుళ్లపై తుపాకీ గురిపెట్టింది. కనిపెంచిన బిడ్డలపై కనీస మమకారం చూపించకుండా నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపింది. ఆ తర్వాత పోలీసులు వచ్చినా చేతిలో తుపాకీని వదిలేయలేదు. వారినీ తుపాకీతో బెదిరించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసుల తూటాకు రాక్షసిగా మారిన ఆ తల్లి కూడా చనిపోయింది. ఈ దారుణం అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్‌లో జరిగింది.
ప్రశాంత పట్టణంగా పేరొందిన హూస్టన్‌లో కాల్పుల మోత మోగింది. 42 ఏళ్ల క్రిష్టీ షిట్స్ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లను తుపాకీతో అమానుషంగా కాల్చిచంపింది. చేతికి అందివచ్చిన 19 ఏళ్ల టైలర్ షీట్స్‌ను, 17 ఏళ్ల మాదిసన్ షీట్స్‌ను తుపాకీతో పొట్టనబెట్టుకుంది. క్రిష్టీ తుపాకుల మోత ప్రారంభించిన కొద్దిసేపటికే పోలీసులకు కాల్ వెళ్లింది. పోలీసులు వచ్చేసరికి పెద్ద కూతురు టైలర్‌కు తూటాలకు కుప్పకూలిపోయింది. మరో కూతురు మాదిసన్ కూడా తూటా గాయాలతో నెత్తురోడుతోంది. ఆ సమయంలో వచ్చిన పోలీసులు తుపాకీ కింద పడేయాలని క్రిష్టీని కోరినా ఆమె వినిపించుకోలేదు. దీంతో పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు. క్షణికావేశంలో ఇంట్లో రక్తపాతం సృష్టించిన క్రిష్టీ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు విడిచింది.
కొన ఊపిరితో ఉన్న మాదిసన్ ను హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించే ప్రాణాలు వదిలింది. ఈ దారుణం జరుగుతున్న సమయంలో ఇంట్లోనే క్రిష్టీ భర్త ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నాడు. కానీ, అతడు మానసికంగా షాక్‌లో ఉండటంతో ఆస్పత్రిలో చేర్చారు. ఇంట్లో మొదలైన చిన్న వాగ్వాదం ఇంత దారుణానికి కారణమైందని ప్రాథమికంగా తెలుస్తున్నదని, క్రిష్టీ భర్త కోలుకుంటేగానీ అసలు ఏం జరిగిందనేది తెలిసే అవకాశముందని హుస్టన్ పోలీసులు చెప్తున్నారు.