ఐఫోన్-7 చార్జింగ్ పెట్టి పడుకోగా..!
కొత్తగా వచ్చిన యాపిల్ ఐఫోన్-7 ఓ మహిళకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఐఫోన్ కు చార్జింగ్ పెట్టి ఆదమరిచి నిద్రించిన ఆమె తీవ్ర కాలిన గాయాలయ్యాయి. దీంతో పడుకునేటప్పుడు సెల్ ఫోన్ లను దూరంగా పెట్టాలని, ముఖ్యంగా చార్జింగ్ పెట్టి ఎంతమాత్రం వాడటం, పడుకొనేముందు పక్కన పెట్టడం సరికాదని హెచ్చరిస్తూ ఆమె ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. దీంతోపాటు ఐఫోన్ వల్ల తన చేతికి తీవ్రంగా కాలిన గాయాలైన ఫొటోను పోస్టు చేశారు. మెల్ బోర్న్ కు చెందిన మేలెనీ టాన్ పీలెజ్ కు ఈమేరకు చేదు అనుభవం ఎదురైందని సిడ్నీ హెరాల్డ్ పత్రిక తెలిపింది.
"ఇటీవల నేను ఐఫోన్-7ను కొన్నాను. అనుకోకుండా ఫోన్ కు చార్జింగ్ పెట్టి దానిని చేతిలో పట్టుకొని నిద్రపోయాను. ఏదో తీవ్ర నొప్పిగా ఉంటే లేచి చూశాను. చెయ్యికి తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో నేను విస్తుపోయాను. ఒక్కక్షణం ఊపిరి ఆగినంత పని అయింది' అని మెలెనీ తన ఫేస్ బుక్ పోస్టులో తెలిపింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఐఫోన్ పట్ల ఇప్పటివరకు తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని, కానీ, తనకు ఇలాంటిది జరగడంతో ఇతరులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశముందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది.