యోగాతో నవయుగం
* శాంతి సామరస్యాల్లో కొత్త శిఖరాలు అందుకునే మానసిక శిక్షణ ఇది: మోదీ
* యోగాను అంగడి సరుకుగా మార్చొద్దు
* అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ
* రాజ్‌పథ్‌లో 36 వేల మందితో కలిసి యోగాసనాలు..
* ప్రపంచవ్యాప్తంగా ఘనంగా తొలి అంతర్జాతీయ యోగా డే
‘‘యోగా భారత్‌లో పుట్టినప్పటికీ.. అది మానవుల సామూహిక కానుక. లోకకల్యాణంలో, మానవులను భాగ్యవిధాతలుగా మార్చడంలో భరతభూమి భాగస్వామిగా ఉంటుంది’’
-ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఓం ఉచ్ఛారణలతో, విశ్వశాంతికి మంత్రాలు చదువుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆదివారం తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సియాచిన్ గ్లేసియర్ల నుంచి దక్షిణ చైనా సముద్ర జలాల వరకూ.. సిడ్నీలోని ప్రముఖ బోండీ బీచ్ నుంచి లండన్‌లోని థేమ్స్ నదీ పరివాహకం వరకూ.. పార్కుల నుంచి తీహార్ జైలులోని ఖైదీ గదుల వరకూ.. వివిధ ప్రాంతాల్లో యోగాసనాలు వేశారు. మౌన ధ్యానంలో మునిగిపోయారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంతో.. శాంతి, సామరస్యాల్లో కొత్త శిఖరాలను అందుకునేలా మానవ మనసుకు శిక్షణ ఇచ్చే కొత్త యుగం ఆరంభమయిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. యోగా అనేది ఒక సిద్ధాంతమని, ధ్యానం వల్ల ఆత్మ ఉన్నతంగా రూపాంతరం చెందుతుందని, ఆలోచనలో ఆచరణలో జ్ఞానంలో భక్తిలో వ్యక్తి ఉత్తముడిగా మారుతాడని చెప్పారు.
యోగాను అంగట్లో అమ్మే వినియోగ వస్తువుగా మార్చరాదన్నారు. ప్రపంచ ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. యోగాను దైనందిన జీవితంలో అంతర్భాగంగా చేసుకునేలా ప్రతినబూనాలని ట్విటర్‌లో పిలుపునిచ్చారు. యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో చేపట్టిన భారీ బహిరంగ యోగా కార్యక్రమంలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ 36 వేల మందితో కలిసి మోదీ కూడా యోగాసనాలు వేశారు. అంతకుముందు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహిస్తున్న 2ల యోగా సదస్సులోనూ ప్రారంభోపన్యాసం చేశారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించటానికి భారత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించేందుకు మద్దతిచ్చిన 193 దేశాలకు, ఐక్యరాజ్యసమితికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. యోగా డేతో శాంతి సామరస్యాలు విస్తరించేలా మనుషుల మనసులకు శిక్షణ ఇవ్వడంలో కొత్త యుగం ప్రారంభమయిందన్నారు. వ్యాయామం యోగా కాదని.. యోగా అనేది అంతకన్నా మించినదని.. మనిషిని ప్రకృతితో మమేకం చేస్తుందని చెప్పారు.
యోగాతో అంతర్లీనంగా శక్తి పటిష్టమవుతుందని, మానసిక ఒత్తిళ్ల నుంచి ముక్తి లభిస్తుందని, శాంతి మార్గంవైపు పయనించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. యోగా ద్వారా లోకకళ్యాణం సిద్ధిస్తుందని, ప్రజలు శాంతి, సామరస్యాలతో జీవనం సాగిస్తారని ఆకాంక్షించారు. యోగాను వ్యాపార వస్తువుగా మారిస్తే.. దానికి మనవల్లే ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. యోగా అనేది వ్యాపారమో, వ్యవస్థో కాదని.. అదొక మానసిక స్థితి అని అన్నారు. యోగా అనేది ఒక ప్రభుత్వం లేదా ఐరాస ఆలోచన నుంచి పుట్టినది కాదని.. అది తరతరాలుగా అందిన కానుక అని అన్నారు.
యోగా భారత్‌లో పుట్టినప్పటికీ.. అది మానవుల సామూహిక కానుక అన్నారు. లోకకల్యాణంలో, మానవులను భాగ్యవిధాతలుగా మార్చడంలో భరతభూమి భాగస్వామిగా ఉంటుందని పేర్కొన్నారు. మనదే నిజమైన యోగా అని, విదేశాల్లో చేసేది తప్పు అనే భావన రాకూడదన్నారు. యోగా అభివృద్ధిలో బయటి దేశాల కృషిని స్వీకరించాలన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టల్ విభాగం రూపొందించిన రూ.5 స్టాంపును, ఆర్థికశాఖ రూపొందించిన రూ. 10, రూ. 100 బిళ్లలను మోదీ ఆవిష్కరించారు.
రాజ్‌పథ్‌లో మోదీ యోగాసనాలు..
వద్దమ్మా.. ప్లీజ్...
రాజ్‌పథ్‌లో జరిగిన యోగా ఉత్సవాల్లో ప్రధాని మోదీ కూడా పాల్గొని ఆసనాలు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తొలుత ఈ కార్యక్రమంలో మోదీ యోగాసనాలు వేసే అంశం లేదు. అయితే.. వేదికపై ప్రసంగించిన తర్వాత.. 64 ఏళ్ల మోదీ నేరుగా కిందికి వెళ్లి చాపపై కూర్చుని మిగతా వారితో పాటు చివరి వరకు పాల్గొన్నారు. తెల్లని స్వెట్ షర్ట్, పైజామా, 3 రంగుల స్కార్ఫ్ ధరించిన మోదీ.. 21 సాధారణ ఆసనాలు వేశారు. వాటిలో పాద్-హస్తాసన, అర్థ-చక్రాసన, త్రికోణాసన, దండాసన, అర్ధ-ఉష్ట్రాసన, వజ్రాసన, శశాంకాసన వంటివి ఉన్నాయి. యోగాసనాల నుంచి సూర్యనమస్కారాన్ని ప్రభుత్వం తొలగించింది. ముస్లింలు ‘ఓం’కు బదులుగా ‘అల్లా’ నామాన్ని జపించవచ్చని పేర్కొంది.
అనంతరం మోదీ కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్, భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మలతో పాటు పెద్ద సంఖ్యలో దౌత్యవేత్తలు, కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరైన వారిలో ఉన్నారు. మోదీ సరసన యోగా గురువు రామ్‌దేవ్ వేదికపై ఉన్నారు. రాజ్‌పథ్‌లో రెండు కిలోమీటర్ల మేర అన్ని వయసుల్లోని జనం నీలి, ఎరుపు రంగుల చాపలపై కూర్చుని ఆసనాలు వేస్తుండగా.. భారీ డిజిటల్ తెరలపై ఇంగ్లిష్, హిందీ భాషల్లో సూచనలతో ఆసనాలు ఎలా వేయాలనేది చూపారు. పాఠశాల విద్యార్థులు, ఎన్‌సీసీ కేడెట్లు, సైనిక సిబ్బంది, అధికారులు సహా వేలాది మంది 35 నిమిషాలు సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో సైతం యోగా దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు కేంద్రమంత్రులు ఆయా రాష్ట్రాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
యోగాకు అద్భుత చికిత్స శక్తులు: ప్రణబ్
న్యూఢిల్లీ: మనిషి సౌఖ్యానికి, ఆధునిక జీవనశైలి సంబంధ వ్యాధులను అరికట్టేందుకు అవసరమైన అద్భుత చికిత్స, నియంత్రణ శక్తులు యోగాకు ఉన్నాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఆయన రాష్ట్రపతి భవన్‌లో యోగా డేను ప్రారంభించి ప్రసంగించారు.
‘భారత్ యోగాకు పుట్టిల్లు. దేశంలో శతాబ్దాల తరబడి దాన్ని పాటిస్తున్నారు. పతంజలి యోగా గురువుల్లో అత్యంత ప్రముఖుడు. యోగా కళతోపాటు శాస్త్రం కూడా’ అని అన్నారు. రాష్ట్రపతి భవన్ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు సహా వెయ్యిమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.