సాక్షి, అమరావతి/సాక్షి, భీమవరం/లేపాక్షి/సీతంపేట/సింథియా: యోగాసాధన ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రోత్సహించడం ప్రపంచ యోగాదినోత్సవ ముఖ్య లక్ష్యమని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతీప్రవీణ్ పవార్ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాద్వారా నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి మన దేశం ఆచరణాత్మక విధానమే కారణమన్నారు. యోగాను ప్రజలకు తెలిపి ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించింది ప్రధాని నరేంద్రమోదీయేనని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భారతీప్రవీణ్ పవార్, కలెక్టర్ పి.ప్రశాంతి విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు.
యోగా వ్యాప్తికి ప్రధాని కృషి అమోఘం
ప్రపంచ దేశాల్లో యోగావ్యాప్తికి ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కృషి అమోఘమని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలోని నంది విగ్రహం వద్ద బుధవారం జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో సర్వరోగాలు దూరమవుతాయని చెప్పారు.
ఒత్తిడి తగ్గించుకోవడం యోగాతోనే సా«ధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగాదినోత్సవంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ పాల్గొన్నారు.
వారసత్వ సంపద యోగా
యోగా మన వారసత్వసంపద అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రపంచానికి ఆరోగ్యదిక్సూచిగా యోగాను అందించిన ఘనత భారతదేశానికే దక్కుతుందని పురావస్తుశాఖ కమిషనర్ జి.వాణీమోహన్ చెప్పారు.
విజయవాడలోని బాపు మ్యూజియంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆమె మాట్లాడారు.అనంతరం మ్యూజియం నుంచి మొగల్రాజపురం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు, అధికారులు పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి యోగా సాధన చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ లక్ష్మీషా సూచించారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన యోగదినోత్సవంలో ఆయన మాట్లాడారు.
తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో..
తూర్పు నావికాదళం పరిధిలోని అన్ని యూనిట్లలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 10 వేలమంది నౌకాదళ సిబ్బంది, డిఫెన్స్ సెక్యూరిటీ కారŠప్స్, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. సముద్ర ఉపరితలం మీద ఉన్న నౌకల్లో, తీరంలో వివిధ ఓడరేవుల్లో, విదేశీ పోర్టుల్లో ఉన్న ఈస్ట్రన్ ప్లీట్ షిప్‌లలో కూడా యోగా దినోత్సవం నిర్వహించారు.
ఇండోనేషియాలోని జకార్తాలో ఐఎన్‌ఎస్ శివాలిక్, బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్‌లో ఐఎన్‌ఎస్ కిల్తాన్, «థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌకల్లో సిబ్బంది యోగాసనాలు వేశారు. మల్కాపురంలోని కేంద్రీయ విద్యాలయంలోని చిన్నారులతో ఇషా ఫౌండేషన్ ప్రతినిధులు యోగాసనాలు వేయించారు. భారతీయ త్రివర్ణ థీమ్‌తో నేవీ సిబ్బంది చేసిన యోగా సాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దివ్యాంగుల యోగా
ఏయూక్యాంపస్: సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం సౌజన్యంతో బుధవారం 500 మంది దివ్యాంగ విద్యార్థులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏయూలో జరిగిన ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది.
కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి, సమగ్ర శిక్ష రాష్ట్ర అదనపు పథక సంచాలకుడు డాక్టర్ కె.వి.శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర సహిత విద్య కో ఆర్డినేటర్ ఎన్.కె.అన్నపూర్ణ, డీఈవో ఎల్.చంద్రకళ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి దివ్యాంగ విద్యార్థులు, ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment