న్యూ ఢిల్లీ: ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ mYoga పేరుతో సరికొత్త యాప్‌ను లాంచ్ చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ ఎంయోగా యాప్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ mYoga యాప్‌లో ఆడియో, వీడియో క్లిప్‌ల సహాయంతో యోగాపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తుందని ఆయూష్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ యాప్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో అభివృద్ధి చేశారు.
ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఐవోస్ యూజర్లకోసం అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ను ఉపయోగించి 12 నుంచి 65 సంవత్సరాల వయసు వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. వివిధ రకాల ఆసనాలను నేర్చుకోవడానికి, సాధన చేయడానికి 10 నుంచి 45 నిమిషాల నిడివితో ఉన్న ఆడియో, వీడియో క్లిప్‌లను ఈ యాప్ అందిస్తోంది.
ఇంటర్నేషనల్ యోగా డే ను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..‘‘కరోనాతో భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దేశంలోని ప్రతి చోటు నుంచి చాలా మంది యోగా సాధకులుగా మారారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్ష కవచంగా మార్చుకోవాలి . యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మంచి ఆరోగ్య సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిన దృఢత్వాన్ని యోగా పెంపొదిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది.’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment