ఆసనాలు వేస్తున్న మోదీ(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి జనం ప్రాణాలను బలిగొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో యోగా అవసరం గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా బాధితులు ఆరోగ్యవంతులుగా మారడానికి యోగా దివ్యౌషధంగా పని చేస్తుందని తెలిపారు. ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలకు సందేశమిచ్చారు. దాదాపు 15 నిమిషాలపాటు ప్రసంగించారు. కరోనా ప్రధానంగా శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుందని అన్నారు. ప్రాణాయామంతో శ్వాస వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. దేశ ప్రజలందరినీ ఐక్యం చేసే చోదకశక్తిగా యోగా రూపాంతరం చెందిందని అభివర్ణించారు. మనుషుల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని వివరించారు. యోగాకు జాతి, కులం, వర్ణం, లింగభేదం, నమ్మకాలతో సంబంధం లేదన్నారు. ఎవరైనా యోగా సాధన చేయొచ్చన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం యోగాతో సాధ్యమని చెప్పారు.
ప్రాణాయామం.. నిత్య జీవితంలో భాగం
‘‘శరీరంలో బలమైన రోగ నిరోధక శక్తి ఉంటే కరోనాను సులువుగా జయించవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ప్రాణాయామం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రాణాయామాన్ని నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలి. ప్రపంచంలో చాలామంది కరోనా బాధితులు యోగాతో ఉపశమనం పొందారు. కరోనాను ఓడించే శక్తి యోగాకు ఉంది’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ‘‘సరైన ఆహారం తీసుకోవడం, సరైన క్రీడల్లో పాలుపంచుకోవడం, క్రమశిక్షణ కలిగి ఉండడం కూడా యోగా చేయడమే’’ అని పేర్కొన్నారు. ఒక కుటుంబంగా, ఒక సమాజంగా మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఔత్సాహికులు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వల్ల ఈసారి చాలా దేశాల్లో డిజిటల్ వేదికలపై ఈ కార్యక్రమం నిర్వహించారు. అమెరికా, చైనా, యూకే, టర్కీ, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, నేపాల్ తదితర దేశాల్లో జనం యోగాసనాలు వేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ ఉద్యోగులు, భారతీయులు పాలుపంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment