వివాదాస్పద రచయితపై దాడి
బెంగళూరు: కర్నాటక కల్చరల్ యాక్టివిస్ట్ యోగేష్ మాస్టర్ పై కొంతమంది దుండుగులు దాడికి పాల్పడ్డారు. దావణ గిరిలోని ఆయనపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంకుదాడి చేశారు. వివాదాస్పద కన‍్నడ రచయిత యోగేష్ పై ఆదివారం భౌతికంగా దాడికి తెగబడ్డారు పబ్లిగ్గా అందరూ చూస్తుండగానే సుమారు ఆరుగురు యువకులు ఆయన్ని కొట్టి ముఖంపై నల్ల రంగు పులిమి అవమానించడం వివాదానికి దారి తీసింది.
ప్రముఖ పాత్రికేయుడు పి. లంకేష్ 82 వ జయంతి ఉత్సవాలకు హాజరైన సందర్భంగా ఈ దాడి జరిగింది. సంఘటన అనంతరం యోగేష విలేకరులతో మాట్లాడారు. "జై శ్రీ రామ్" నినాదాలతో బైక్ పై వచ్చిన సుమారు ఆరుగురు వ్యక్తులు, తనను కొట్టి, దాడిచేశారని, ఇంకు పోసి, చొక్కా చించివేశారని ఆరోపించారు. ఫంక్షన్ తరువాత బాపూజీ డెంటల్ కాలేజ్ రోడ్ లో ఒక టీ స్టాల్ వద్ద టీ తాగడానికి వెళ్ళినప్పుడు సంఘటన జరిగిందని తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై పలువురు జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు స్పందించారు. జర్నలిస్టు గౌరి లంకేష్, సీపీఐ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యులు సిద్దన్న గౌడ్ పాటిల్, కార్మికనాయకులు తీవ్రంగా ఖండించారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉందంతంపై రచయిత దావణగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా యోగేష్ మాస్టర్ రచించిన ‘దుంది కరణ్యకనోబ్బ గణపతియాదే కథ’ పుస్తకం వివాదాన్ని సృష్టించింది. దీనిపై నాలుగు సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ పలు హిందూత్వ సంఘాలు ఆందోళనకు దిగాయి. వారి అభ్యంతరాల తర్వాత ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.