దిల్‌సుఖ్‌నగర్ బాంబు కేసును విచారిస్తున్న ఎల్‌బీనగర్ ఐదో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి శ్రీనివాసరావు గురువారం చర్లపల్లి కారాగారాన్ని సందర్శించారు.
కుషాయిగూడ: దిల్‌సుఖ్‌నగర్ బాంబు కేసును విచారిస్తున్న ఎల్‌బీనగర్ ఐదో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి శ్రీనివాసరావు గురువారం చర్లపల్లి కారాగారాన్ని సందర్శించారు. బాంబు కేసు నిందితుడు భత్కల్‌ను కోర్టు తరలిస్తున్న క్రమంలో చోటు చేసుకుంటున్న భద్రతా పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయన జైలును సందర్శించారు. ప్రతిసారీ కోర్టుకు తరలించే క్రమంలో భత్కల్ బృందం పాల్పడుతున్న చర్యలకు చెక్ పెట్టాలని భావించిన అధికారులు చర్లపల్లి జైలులోనే విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు.
అందులో భాగంగా జైలు కోర్టు హాలును ఆయన పరిశీలించి వెళ్లినట్లు జైలు పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. అయితే గతంలో 2006-07 సంవత్సరంలో దీన్‌దార్ బాంబు కేసు నిందితులను కూడ ఇదే తరహాలో విచారించినట్లు ఆయన పేర్కొన్నారు. కరడుగట్టిన నేరస్థుల విషయంలో భద్రతా పరమైన చర్యలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి విచారణ చేయడం సర్వసాధారణమేనన్నారు.