సీఎం యోగి మరో కీలక నిర్ణయం
లక్నో: అధికారంలోకి రాగానే అక్రమ కబేలాపై చర్యలు చేపడతామన్న ఎన్నికల హామీని అమల్లోపెట్టిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథన్ మరో వాగ్దానం నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. పోకిరీల ఆట కట్టించేందుకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాల మేరకు పోలీసులు ఈవ్ టీజింగ్ వ్యతిరేక బృందాలు ఏర్పాటు చేశారు. లక్నో జోన్ పరిధిలోని 11 జిల్లాల్లో ఈ బృందాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు చేశారు. ప్రతి జిల్లాల్లోనూ యాంటి ఈవ్ టీజింగ్ టీమ్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
విద్యార్థినులను వేధించే వారిని పట్టుకునేందుకు కాలేజీలు, పాఠశాలల సమీపంలో ఈ బృందాలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. పిలిభిత్ లో ఇప్పటికే ఐదుగురు పోకిరీలను ఈవ్ టీజింగ్ వ్యతిరేక బృందం అరెస్ట్ చేసింది. మీరట్ లోనూ ఒకరిని ఈ బృందం పట్టుకుంది. యాంటి ఈవ్ టీజింగ్ టీమ్స్ పనితీరు గురించి స్కూళ్లు, కాలేజీల్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఈవ్ టీజింగ్ కు చెక్ పెడతామని మీరట్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా హామీయిచ్చారు. యాంటి రోమియో బృందాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని చాలా మంది మండిపడుతున్నారు. వేధింపులు, మోరల్ పోలీసింగ్ కు దిగుతున్నాయని ఆరోపిస్తున్నారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా యాంటి రోమియో బృందాలు పనిచేస్తాయని బీజేపీ నేత సునీల్ భరాలా వ్యాఖ్యానించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.