భార్యతో వివేక్ తివారీ (ఫైల్)
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో శనివారం జరిగిన యాపిల్ సంస్థ మేనేజర్ వివేక్ తివారి ఎన్‌కౌంటర్‌పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లకు బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్ రాజీనామా చేయాలని సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వానికి వారి కుటుంబం నుంచి ఊహించని షాక్ తగిలింది. పోలీసుల కాల్పుల్లో మరణించిన వివేక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రులు బ్రజేష్ పాఠక్, అశుతోష్ టాండన్‌లు ఆదివారం వారి ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం తరుఫున నుంచి రూ. 25 లక్షల నష్టపరిహరం అందిస్తున్నట్లు ప్రకటించారు.
దీనికి వివేక్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు 25 లక్షలు అవసరం లేదని.. కోటి పరిహారం కావాలని అతని భార్య కల్పన డిమాండ్ చేశారు. తమ కుటుంబమంతా వివేక్‌పైనే అధారపడి ఉందని.. పోలీసులు అక్రమంగా కాల్చి చంపారని, తమ పిల్లల భవిష్యత్తు ఏంటని ఆమె ప్రశ్నించారు. సీఎం యోగి ఆదిత్యా ఇక్కడి వచ్చి తమకు సమాధానం చెప్పే వరకు మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించమని ఆమె తేల్చి చెప్పారు. ఆమెను కాసేపు మంత్రులు సముదాయించే ప్రయత్నం చేసిన వారి మాట వినకపోవడంతో మంత్రులు తిరిగి వెళ్లి పోయారు. తనంతరం ఆప్ నేత ఢిల్లీ మంత్రి సంజయ్ సింగ్ మృతుడి కుంటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ వారితో ఫోన్లో మాట్లాడి వివేక్ కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడతమని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment