తమ్ముడి ‘కోటా’ అన్న పాలు
ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక చిన్న పొరపాటు తెలుగు తమ్ముడు ఒకరికి టికెట్ రాకుండా చేసింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్రయాదవ్ పేరు దాదాపుగా ఖరారైంది. ఖరారైనట్టు ఆయనకు సమాచారం కూడా ఇచ్చారు. దాంతో ఆయన నామినేషన్ వేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ పత్రికలు, టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. అయితే ఈ పరిణామం అదే జిల్లాకు చెందిన కీలక నేత ఒకరికి కోపం తెప్పించింది. టికెట్ ఖరారైన తర్వాతగానీ ముందుగానీ తనను కలుసుకోలేదనీ కనీసం ఫోన్‌లో పలకరించలేదన్న కోపంతో చివరి నిమిషంలో చక్రం తిప్పి టికెట్ రాకుండా చేశారట! దీనికోసం రవిచంద్ర అన్నను రంగంలోకి దింపారు.
రవిచంద్ర సోదరుడు మస్తాన్‌రావు గత ఎన్నికల్లో కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మీ సోదరుడికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే భవిష్యత్తులో మీకు ఎమ్మెల్యే టికెట్ రాదని చంద్రబాబు వద్ద పలుకుబడి ఉన్న ఆ నేత మస్తాన్‌రావు చెవిలో ఊదారు. తన తమ్ముడి టికెట్ కాస్తా తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందన్న ఆలోచన అన్నను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో చెవిలో ఊదిన ఆ ముఖ్య నేత ద్వారానే విషయాన్ని అధినేతకు చేరవేశారు. దాంతో భవిష్యత్తులో అన్నకు టికెటిస్తాం... కాబట్టి ఈసారి తమ్ముడికి లేదని తేల్చేశారు. ఎంపిక చేసిన అభ్యర్థిని పక్కకు తప్పించాల్సిన పరిస్థితి ఇంత సులభంగా దక్కడంతో అధినేత సైతం అనంతపురం జిల్లాకు చెందిన తిప్పేస్వామి పేరును ఖరారు చేశారట. ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో... అన్నన్నా! ఎంతపనిచేశారంటూ తెలుగు తమ్ముడు నివ్వెరపోయారట.