పేపర్ కటర్ తో ముఖంపై దాడి
ముంబై: మద్యం మత్తులో యువతీయువకులు నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన వాణిజ్య రాజధాని ముంబైలో కలకలం రేపింది. కారులో వెళుతున్న ఓ యువతి, ఆమె ఇద్దరు స్నేహితులు బైకుపై వెళుతున్న వ్యక్తిపై పేపర్ కటర్ తో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అతడిని ముఖాన్ని, మెడను పేపర్ కటర్ తో చీల్చేశారు.
వెస్ట్ మలాడ్ లోని ఓర్లెమ్ చర్చి సమీపంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు ట్రేడ్ కమర్షియల్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న ఇర్విన్ కార్డొజ్(29)గా గుర్తించారు. జిమ్ నుంచి ఇంటికి వస్తుండగా అతడిపై దాడి జరిగిందని మలాడ్ పోలీసులు తెలిపారు.
దాడికి పాల్పడిన కాలేజీ విద్యార్థిని మిహిక వాడొన్(21), ఆమె స్నేహితుడు సిద్ధార్థ్ యాదవ్(21)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి మరొకరు పారిపోయారు. తనపై అకారణంగా దాడి చేశారని బాధితుడు వాపోయాడు. గాయాలపాలైన ఇర్విన్... స్నేహితుడు, తల్లి సహాయంతో ఆస్పత్రిలో చేరాడు.