
ఎదురుచూసి మోసపోయింది!
- అసోంలోని అత్తారింటికి బయలుదేరి.. భర్త చేతిలో మోసపోయిన యువతి
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మూడురోజులుగా పడిగాపులు
- మోసపోయానని గ్రహించి ట్యాంక్ బండ్ వద్ద ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి...సొంత రాష్ట్రానికి తీసుకుని వెళతానని నమ్మించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వదిలించుకుని వెళ్లిపోయాడు. ఒకటికాదు రెండుకాదు ఏకంగా మూడు రోజులు వేచి చూసిన ఆ యువతి.. చివరికి మోసపోయానని గ్రహించింది. తీవ్ర మనస్థాపంతో అలా నడుచుకుంటూ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.. అదృష్టవశాత్తు ఆమెను పోలీసులు కాపాడారు. లేక్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం..
మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం దోగి గ్రామానికి చెందిన అమీరాబేగం స్థానికంగా సెక్యూరిటీగార్డుగా పనిచేస్తుంది. శంకర్‌పల్లిలో ఆమె పనిచేసే చోట అసోం రాష్ట్రానికి చెందిన సాహబ్ అలీ కూడా పనిచేసేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరి ప్రేమగా మారింది. జూలై 15వ తేదీన ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని శంకర్‌పల్లిలో కలిసి నివసిస్తున్నారు. తన సొంత రాష్ట్రమైన అసోంకు తీసుకుని వెళతానని సాహబ్ అలీ గత నెల 30వ తేదీన అమీనాబేగంను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తీసుకుని వచ్చాడు. ఆమెను ప్లాట్‌ఫాంపై వదిలి టికెట్లు తెస్తానని వెళ్లి తిరిగిరాలేదు.
శనివారం వరకు స్టేషన్ లోనే వేచి చూసిన ఆమె మోసపోయానని గ్రహించి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. సాయంత్రం లేపాక్షి పూజా స్టోర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఆమెను లేక్ పోలీసులు గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి విచారించగా తనకు జరిగిన మోసం గురించి చెప్పింది. దీంతో ఆమె వివరాల కోసం జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ముషీరాబాద్‌లోని మహిళా హోంకు ఆమెను తరలించారు.