ఫోన్ మెసేజ్‌తో భయానకం..
శివాజీనగర (హాసన్): ప్రేమ, పెళ్లి అని వేధిస్తున్న కేఎస్‌ఆర్‌టీసీ బస్ డ్రైవర్ ఆగడాలు భరించలేక న్యాయశాస్త్రం విద్యార్థిని క్రిమిసంహారక మందు తాగి తనువు చాలించింది. ఈ సంఘటన హాసన్ జిల్లా సకలేశపురలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సకలేశపురలో ఒక కాలేజీలో లా ఫస్టియర్ విద్యార్థిని ఆదరగెర గ్రామానికి చెందిన సుదేశ్–సుమిత్రల కుమార్తె తనుశ్రీ (18) మృతి చెందిన యువతి. ఆమె ప్రతిరోజు కాలేజీకి బస్సులో రాకపోకలు సాగించేది. ఆమె తరచుగా ప్రయాణించే బస్సులోని డ్రైవర్ సంతోష్ రెండు సంవత్సరాల నుంచి తనుశ్రీని ప్రేమిస్తున్నానని వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడు. తనుశ్రీ ఎక్కడ కనిపించినా ఈమె తన ప్రియురాలు, ఈమెనే వివాహం చేసుకొంటానని స్నేహితులతోను, తోటి ఉద్యోగులతో చెబుతుండేవాడు.
ఫోన్ మెసేజ్‌తో భయానకం - ఈ నెల 3న తనుశ్రీకి మెసేజ్ చేసిన సంతోష్, ‘నేను మద్యంలో విషం కలుపుకొని తాగి మరణిస్తున్నాను. మన ప్రేమ విషయంలో మీ తండ్రే గెలిచాడు. అయితే అది జరగటం లేదు. నేనిప్పుడు చస్తున్నాను. మరు జన్మమంటే ఉంటే కలుసుకొందాం’’ అని టైపు చేసి పంపాడు. మెసేజ్ చూచి భయపడిన తనుశ్రీ అదే రోజు సాయంత్రం ఇంట్లో ఉన్న పురుగులమందును తాగింది. తక్షణమే ఆమెను మంగళూరులోని ఏజే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించకపోవటంతో ఈ నెల 17న మరణించింది. పురుగులమందు తాగిన సంతోష్ మంగళూరులోని ఫాదర్ ముల్లార్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.