ఆత్మహత్య చేసుకోవడానికే వస్తున్నారు: డీజీపీ
శ్రీనగర్: భద్రతా దళాలపై రాళ్లు రువ్వేందుకు ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రదేశాలకు వస్తున్న కశ్మీర్ యువత తీరుపై ఆ రాష్ట్ర డీజీపీ ఎస్పీ వేద్ తాజాగా స్పందించారు. ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి యువత రావడమంటే ఆత్మహత్య చేసుకోవడమేనని పేర్కొన్నారు. అలాంటి చర్యలకు యువత పాల్పడకుండా నిగ్రహంగా ఉండాలని సూచించారు.
'ఎన్‌కౌంటర్ జరుగుతున్నప్పుడు భద్రతా దళాలు, పోలీసులు సైతం రక్షణకు అడ్డుగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేదా ఇల్లు ఉండేలా చూసుకుంటారు. కానీ యువత మాత్రం నేరుగా ఆత్మహత్య చేసుకోవడానికే ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రదేశాలకు వస్తున్నారు' అని ఎస్పీ వేద్ విలేకరులతో అన్నారు. ఎన్‌కౌంటర్ ప్రదేశాలకు యువత రాకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతికి విఘాతం కలిగించే శక్తులే యువతను తప్పుగా ప్రేరేపించి.. తప్పు దోవ పట్టించేందుకు ఇలా రెచ్చగొడుతున్నాయని చెప్పారు. తమ సంకుచిత రాజకీయాల కోసం యువతను కొందరు వాడుకుంటున్నారని, ఈ విషయాన్ని యువత గుర్తించాలని సూచించారు.
ఎన్‌కౌంటర్ ప్రారంభమైన వెంటనే 300లకుపైగా వాట్సాప్ గ్రూపులలో, ఫేస్‌బుక్‌లలో దుష్రచారం చేసి..యువతను రెచ్చగొడుతున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా గ్రూపులలో జరుగుతున్న దుష్ర్పచారంపై కట్టుదిట్టమైన నిఘా పెట్టినట్టు తెలిపారు. బుడ్‌గామ్ ఎన్‌కౌంటర్‌లో ఒక మిలిటెంట్ సహా.. ముగ్గురు యువత చనిపోయిన సంగతి తెలిసిందే. మిలిటెంట్‌కు మద్దతుగా భద్రతా దళాలపై యువత రాళ్లు రువ్వడంతో జవాన్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు విడిచారు.