
కాంగ్రెస్ పోరుసభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తిరుపతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రారంభమైన పోరుసభలో కలకలం రేగింది. సభలో కోటి అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. కోటిని రక్షించబోయిన శేషాద్రి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కోటిని తిరుపతిలోని మంచాలవీధికి చెందినవాడిగా గుర్తించారు.
శనివారం సాయంత్రం తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో పోరు సభ జరిగింది. ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, పల్లంరాజు తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. వాటర్ బాటిల్ లో పెట్రోల్ తీసుకుని సభకు వచ్చిన కోటి.. సభ ప్రారంభమైన కాసేపటికి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో సభలో గందరగోళం ఏర్పడింది. అనూహ్య సంఘటనతో కాంగ్రెస్ నేతలు షాకయ్యారు. కోటికి మెరుగైన చికిత్స ఏర్పాట్లు చేస్తామని, 2 లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్టు రఘువీరారెడ్డి చెప్పారు.