వైఎస్ జగన్ దీక్ష వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 నుంచి గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక దీక్ష వాయిదా పడింది. దీక్ష వాయిదా విషయాన్ని వైఎస్ఆర్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. హైకోర్టు తీర్పు వచ్చాక వైఎస్ జగన్ దీక్ష తదుపరి తేదీలను ప్రకటిస్తామని ఆయన శుక్రవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు.
వైఎస్ జగన్ దీక్షకు అనుమతి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్ఆర్ సీపీ దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్ను శుక్రవారం హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. హౌస్మోషన్ పిటిషన్ కాకుండా రెగ్యులర్ పద్దతిలో రావాలని హైకోర్టు సూచించినట్టు పెద్దిరెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ దీక్ష అనుమతి కోసం సోమవారం మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, వైఎస్ జగన్ దీక్షకు హైకోర్టు అనుమతి ఇస్తుందని, తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు పెద్దిరెడ్డి చెప్పారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వైఎస్ జగన్ దీక్ష వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్ దీక్షను అడ్డుకున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు రెండుసార్లు దీక్షలు చేయలేదా అని ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో జయలలిత కావేరి జలాల కోసం దీక్ష చేశారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు.