హోంమంత్రి, ఆర్థికమంత్రికి వైఎస్సార్‌సీపీ బృందం వినతిపత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. జగన్ వెంట పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ఎంపీలు పి.వి. మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని పెండింగ్ హామీలు, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్‌పై, అవినీతి వ్యవహారాలపై వినతిపత్రాలు సమర్పించారు.
వాటిలోని ముఖ్యాంశాలు ఇవీ..
థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఒక మెగావాట్ విద్యుదుత్పత్తి సామర్థ్యానికి రూ. 5.5 కోట్లు దాటరాదన్నది అందరికీ తెలిసిందే. కానీ కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఒక మెగావాటుకు రూ. 8 కోట్ల వరకు అనుమతించారు. ఒకవైపు స్టీలు ధర మెట్రిక్ టన్నుకు రూ. 60 వేల నుంచి రూ. 40 వేలకు తగ్గింది. అయినా చంద్రబాబునాయుడు ఒక్క సివిల్ పనుల వ్యయాన్నే రూ.2,300 కోట్ల మేర అదనంగా అనుమతించారు.
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఒక మెగావాట్‌కు రూ. 6 కోట్లు దాటింది. బాబుకు బినామీగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేశ్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్టీపీపీకి చెందిన కాంట్రాక్టర్లందరూ బలవంతంగా తప్పుకునే పరిస్థితి తెచ్చారు. ఆ తరువాత ధరలు సమీక్షించి సీఎం రమేశ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఖజానాకు భారీగా నష్టం చేకూర్చారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 22 శాతం ఎక్సెస్ చేసిన వారికి టెండర్లు కట్టబెట్టారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా జీవో నెంబర్-22 జారీ చేశారు. భారీగా ముడుపులు అందుకుని అదనపు మద్యం ఉత్పత్తి చేసేందుకు ఎంపిక చేసిన డిస్టలరీలకు అనుమతులిచ్చారు. తమకు అనుకూలమైన పరిశ్రమలకు అడగకుండానే రాయితీలు ఇచ్చారు. వైఎస్సార్ జిల్లాలోని బెరైటీస్ బేసిక్ ధరను తగ్గించి ఖజానాకు భారీ నష్టం కలిగించారు.
కుంభకోణాలపై దర్యాప్తు చేయండి
Published Fri, Jun 12 2015 1:00 AM | Last Updated on Tue, May 29 2018 3:02 PM
Advertisement